రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు

27 Sep, 2022 15:04 IST|Sakshi

కీవ్‌: రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్‌ అనే ఉక్రెయిన్‌ సైనికుడి ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకుంది. ఉక్రెయిన్‌ మంత్రిత్వశాఖ ఆ షాకింగ్‌ ఫోటోలతోపాటు .. రష్యా జెనివా ఒప్పందాలకు కట్టుబడి దాదాపు 204 మంది ఉక్రెనియన్‌ యుద్ధ ఖైదీలను విడుదల చేసినట్లు పేర్కొంది.

నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అనే క్యాప్షన్‌ జోడించి మరీ ఆ సైనికుడు ఫోటోలను పోస్ట్‌ చేసింది. అయితే యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు చెరలో నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతనేనా అనేంత విస్తుపోయేలా దారుణంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే డయానోవ్‌ రష్యా చెర నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టవంతుడనే చెప్పాలి.

కాగా అతను మారయుపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ వర్క్‌లను రక్షించే నిమిత్తం యుద్ధం చేస్తున్న సమయంలోనే నిర్బంధింపబడ్డాడు. రష్యా విడుదల చేసిన 250 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలలో అతను ఒకడు. ఈ క్రమంలో సదరు యుద్ధ సైనికుడి సోదరి అలోనా నామ్రష్కో మాట్లాడుతూ...అతను ముఖం చేతులపై గాయాలతో కృశించిపోయి ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం డయానోవ్‌ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది.

పేలుడు పదార్థాలలోని ఒక లోహం అతని చేతిలోకి దిగిపోయిందని, ఐతే దాన్ని వారు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా తీయడంతో సుమారు 4 సెం.మీ ఎముకను తీసేయాల్సి వచ్చినట్లు వెల్లడించింది. అతని పరిస్థితి చాలా క్రిటకల్‌గా ఉందని, దీర్ఘకాలిక చికిత్స అవసరమని కన్నీటిపర్యంతమయ్యింది. తన సోదరుడు మానసికంగా దృఢంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యంగా అతను తిరిగొచ్చినందుకు అత్యంత ఆనందంగా ఉందని చెప్పింది. డయానోవ్‌ కూడా తాను హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నాడు.
(చదవండి: దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు)

మరిన్ని వార్తలు