బాత్‌టబ్‌లో ఐఫోన్‌ చార్జింగ్‌.. షాకింగ్‌

15 Dec, 2020 13:45 IST|Sakshi

మాస్కో : స్మార్ట్‌ఫోన్‌ ప్రమాదాలకు సంబంధించి మరో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. బాత్‌టబ్‌లో ఉండగా చార్జింగ్‌లో ఉన్న ఐఫోన్‌ షాక్‌కొట్టి  ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రష్యాలోని అర్ఖంగెల్స్‌క్‌ నగరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో గతంలో ఆమె బాత్‌టబ్‌లో ఉండగా తీసుకున్న సెల్ఫీ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. మరోవైపు దేశంలో ఈ తరహా మరణాలు సంభవించడంతో స్పందించిన రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. వాటర్‌,  విద్యుత్‌ మెయిన్‌లకు అనుసంధానించబడిన విద్యుత్ ఉపకరణాలు ప్రమాదకరమని, అప్రమత్తంగా ఉండాలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఒలేసియా సెమెనోవా (24) స్నానం  చేస్తోంది. ఇంతలో పక్కనే ఛార్జింగ్ మోడ్‌లో ఉన్న ఆమె ఐఫోన్ 8 టబ్‌లో పడిపోయింది.  ఏం జరిగిందో ఆమె గమనించేలోపే.. ఒక్కసారిగా ఆమె విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె స్నేహితురాలు డారియా  పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది..టబ్‌లో అచేతనంగా పడి ఉన్న  ఆమెను చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యా.. గట్టిగా పిలిచా.. పలకలేదు.. ఆమెను తాకినప్పుడు తనకు కూడా షాక్ కొట్టిందంటూ వణికిపోయిందామె.  అంతేకాదు అప్పటికి ఇంకా వాటర్‌లోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ అవుతోందని  తెలిపింది. అటు ఛార్జింగ్‌లో ఉండగా ఐఫోన్‌ బాత్‌టబ్‌లో పడిందని, దీంతో విద్యుత్‌షాక్‌తో సెమెనోవా మృతిచెందినట్టు పారామెడిక్స్ ధృవీకరించింది. కాగా 2019 లో, 26 ఏళ్ల రష్యన్ మహిళ,   ఆగస్టులో మాస్కోలో 15 ఏళ్ల బాలిక ఇదే తరహాలో మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు