ఏలియన్స్‌ సంచారం.. క్లారిటీ ఇచ్చిన అమెరికా అధ్యక్ష భవనం

14 Feb, 2023 16:29 IST|Sakshi

వాషింగ్టన్‌: ఒకవైపు గగనతలంలో చైనా నిఘా బెలూన్ల కూల్చేసిన అమెరికా.. అదే సమయంలో గుర్తుతెలియని వస్తువులనూ నేల కూల్చినట్లు ప్రకటించి యావత్‌ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. పైగా గ్రహాంతర వాసుల చర్య, ఏలియన్ల పనే అనే కోణాలను కొట్టిపారేయలేమంటూ ఆ దేశానికే చెందిన ఓ అధికారి(మాజీ) వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది కూడా. ఈ తరుణంలో.. 

వైట్‌హౌజ్‌ స్పందించింది. ఏలియన్లు, గ్రహాంతర వాసులు, యూఎఫ్‌వోల వాదనను కొట్టిపారేసింది.  కూలిన వస్తువులకు.. ఏలియన్లు, గ్రహాంతరజీవుల కదలికలకు సంబంధం లేదని వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు. ‘‘తాజా కూల్చివేతలపై వైట్‌హౌజ్‌ నుంచి వెలువడుతున్న సుస్పష్టమైన ప్రకటన ఇది. ప్రపంచ దేశాల్లో.. ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందరో ఆరాలు తీస్తున్నారు. కానీ, ఇది గ్రహాంతర వాసుల చర్య అనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.  ఇది మాత్రం క్లియర్‌ అని ప్రకటించారామె. పైగా ఆ సమయంలో.. ఏలియన్‌ సినిమాల పేర్లను ప్రస్తావించి ప్రెస్‌మీట్‌లో నవ్వులు పూయించారు కూడా.

ఇక స్పై బెలూన్ల కూల్చివేత తర్వాత.. ఉత్తర అమెరికా ఎయిర్‌స్పేస్‌లో రెండు, కెనడా ఎయిర్‌స్పేస్‌లో ఒకటి.. గుర్తుతెలియని వస్తువులను యుద్ధవిమానాలతో నేలకూల్చేసింది అమెరికా సైన్యం. కానీ, అవి ఏంటన్నదానిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. ఏలియన్లు, గ్రహాంతరవాసుల వాదన తెర మీదకు వచ్చింది. నేలకూల్చిన ఆ వస్తువులు కమ్యూనికేషన్‌కు సంబంధించి పరికరాలు కావని, అవి ప్రజలకు హాని కలిగించేవిగా కూడా లేవనే విషయం స్పష్టమైంది వైట్‌హౌజ్‌ పేర్కొంది.

అధ్యక్షుడు జో బైడెన్‌ అవేంటో గుర్తించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించారు. అయితే.. నేల​ కూల్చిన వస్తువుల శిథిలాలను ఇంకా తాము సేకరించలేదని యూఎస్‌ డిఫెన్స్‌ సెక్రెటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ ఇదివరకే స్పష్టం చేశారు.  అసలు అవి ఏంటి? వాటి స్వభావం.. ఇతర విషయాలను వాటిని సేకరించిన తర్వాతే ఓ స్పష్టత వస్తుందని పేర్కొన్నారాయన.

మరిన్ని వార్తలు