బ్రీథలైజర్‌ టెస్టుకు సింగపూర్‌ ఓకే

25 May, 2021 04:38 IST|Sakshi

శ్వాసతో ఒక్క నిమిషంలోనే కరోనా ఫలితం

అభివృద్ధి చేసిన వారిలో భారత సంతతి ప్రొఫెసర్‌

సింగపూర్‌: కరోనా పాజిటివా? లేక నెగెటివా? అనేది కేవలం ఒక్క నిమిషంలో నిర్ధారించే బ్రీథలైజర్‌ టెస్టుకు సింగపూర్‌ ప్రభుత్వ అధికార యంత్రాంగం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. దీన్ని బ్రెఫెన్స్‌ గో కోవిడ్‌–19 బ్రీత్‌ టెస్టు సిస్టమ్‌ అని పిలుస్తున్నారు. శ్వాసతో కరోనా ఫలితాన్ని తేల్చే ఈ పరీక్షను నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఎన్‌యూఎస్‌)కు చెందిన ముగ్గురు గ్రాడ్యుయేట్లు డాక్టర్‌ జియా జునాన్, డూ ఫాంగ్, వానే వీతోపాటు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌ వెంకటేశన్‌ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. నలుగురు ఉమ్మడిగా బ్రీథోనిక్స్‌ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే బ్రీథలైజర్‌ టెస్టును రూపొందించారు. సింగపూర్‌లో ఇలాంటి శ్వాస పరీక్షకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సింగపూర్‌లో ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్టులు(ఏఆర్‌టీ) చేస్తున్నారు. ఇకపై ఈ టెస్టుతోపాటు శ్వాస విశ్లేషణ పరీక్ష కూడా చేయనున్నట్లు బ్రీథోనిక్స్‌ వెల్లడించింది.  విదేశాల నుంచి సింగపూర్‌కు వచ్చేవారికి బ్రీథలైజర్‌ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు