పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు

24 Feb, 2021 11:55 IST|Sakshi

పనిమనిషిని చిత్ర హింసలకు గురి చేసిన భారత సంతతి మహిళ

వేధింపులకు తాళలేక పనిమనిషి మృతి

నిందితురాలికి జీవిత ఖైదు విధించాలని డిమాండ్‌

సింగపూర్‌ సిటీ : సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ తన పనిమనిషి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ఆకలికి అలమటిస్తున్న ఆమెకు పట్టెడు మెతుకులు కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన గయాతిరి మురుగన్‌ అనే మహిళ 2015 నుంచి సింగపూర్‌లో నివసిస్తోంది. ఐదు నెలల క్రితం ఆమె మయన్మార్‌కు చెందిన పియాంగ్‌ను పనిలో పెట్టుకుంది. పనిలో చేరిన మరుక్షణం నుంచి గయాతిరి ఆమెతో క్రూరంగా ప్రవర్తించేది. బండెడు చాకిరి చేసిన ఆమెకు కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదు. పైగా ప్రతిరోజు ఆమెను కొడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను ఇంట్లోనే బంధించింది.

ఇంట్లోని ఓ రూమ్‌లో గ్రిల్‌కు కట్టేసి, ఆమెపై వేడివేడి పదార్థాలు వేసి నరకం చూపించింది. దీంతో ఆమె పెట్టిన చిత్రహింసలు తాళలేక ఆ పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహానికి శవ పరీక్ష చేయగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో 31 చోట్ల గాయాల తాలూకు మచ్చలుండగా, బయట చర్మం మీద 47 గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయిందన్నారు. పోషకాహారం అందకపోవడం కూడా ఆమె చావుకు మరొక కారణమని పేర్కొన్నారు.

కాగా నిందితురాలి మీద 28 అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్య అని పనిమనిషి బంధువుల తరపు న్యాయవాది మహమ్మద్‌ ఫైజల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలికి జీవితఖైదు లేదా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరారు.

చదవండి: కూల్‌డ్రింక్‌ ఆర్డర్‌ చేస్తే.. యూరిన్‌ బాటిల్‌ వచ్చింది!

మరిన్ని వార్తలు