ఆ దేశ మహిళలకు మద్దతుగా జట్టు కత్తిరించుకున్న ప్రముఖ సింగర్

28 Sep, 2022 12:04 IST|Sakshi

ఇస్తాన్‌బుల్‌: హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ   మహిళలకు టర్కీ ప్రముఖ సింగర్‌ మెలెక మొసో మద్దతు తెలిపారు. స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్‌ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హిజాబ్‌ ధరించనందుకు ఇరాన్‌లో 22 ఏళ్ల యువతి మహస అమీనిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె మరణించింది. పోలీసులు హింసించడంతోనే ఆమె చనిపోయిందని ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం వీరిపై ఉక్కుపాదం మోపింది. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. ఇప్పటివరకు 75 మంది నిరసనకారులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు ఇతర దేశాల్లోని ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.

షరియా, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఏడేళ్లు పైబడిన ముస్లిం అమ్మాయిలు జుట్టు కన్పించకుండా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. బుర్ఖా లాంటి పొడవైన వస్త్రాలు ధరించాలి. కొన్ని ముస్లిం దేశాలు దీన్ని పాటించకపోయినప్పటికీ ఇరాన్ ఈ నిబంధనను తప్పనిసరి చేసింది. జులై 5న అధికారిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడి మహిళలతో పాటు వారి కుటుంబసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
చదవండి: హిజాబ్‌ ఆందోళనల్లో సోదరుడు మృతి.. జుట్టుకత్తిరించుకున్న యువతి

మరిన్ని వార్తలు