నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?

19 Jun, 2022 11:59 IST|Sakshi

భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..

మనకు తెలిసింది కొంచెమే!
మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు.

ఏలియన్లకు లింకేంటి?
అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్‌ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్‌) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా.

ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్‌)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

హడల్‌ జోన్‌.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా..
గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్‌ జోన్‌’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు.

సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్‌ జోన్‌’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్‌ జోన్‌లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి.

ప్రయోగాలు మొదలెట్టిన నాసా..
సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది.

చంద్రుడిపైకి నాసా ‘వైపర్‌’
మంచు, దాని అడుగున నీటిలో (సబ్‌ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్‌ ‘వైపర్‌’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్‌’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు.

ఆ నీటి అడుగున చిత్రాలెన్నో..
► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్‌ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది.

► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్‌ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్‌ జెల్లీఫిష్‌’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు.

►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్‌ వెంట్స్‌ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు.

► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్‌ వెంట్స్‌’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు