అమెరికాలో భారీ మంచు తుపాను

19 Dec, 2020 04:12 IST|Sakshi
జపాన్‌లోని ముయికమాచీలో మంచు కారణంగా రహదారిపై నిలిచిన వాహనాలు

న్యూయార్క్‌/టోక్యో: అమెరికాలో  బుధ, గురువారాల్లో కురిసిన తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 40 అంగుళాల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది.  మంచు తుఫానుకు చలిగాలి తోడవడంతో న్యూఇంగ్లాండ్‌ప్రాంతంలోని రాష్ట్రాల్లో, మిడ్‌ అట్లాంటిక్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మంచు తుఫానుతో ప్రభావితం అవుతారని భావిస్తున్న 60 లక్షల మందిని అప్రమత్త పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారు. పలు విమానాశ్రయాల్లో మంచు పేరుకుపోతోందని తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను తగ్గగానే మంచు తవ్వే ప్రక్రియ ఆరంభిస్తామన్నారు. ఒకటీ రెండు రోజుల్లో తుపాను కాస్త తగ్గు ముఖం పట్టవచ్చని అంచనా.  

జపాన్‌లో జా..మ్‌
గురువారం రాత్రి నుంచి మంచు తుపాను కారణంగా జపాన్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 15 కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోగా, సుమారు 1000 మందికి పైగా ఇందులో చిక్కుకుపోయారు. టోక్యో, నైగటాలను కలిపే కనెట్సు ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్‌ జామ్‌ బుధవారం నుంచి ఆరంభమై, గురువారం నాటికి తీవ్రతరమైంది. దీంతో ప్రస్తుతం సదరు రహదారి ఎంట్రన్స్‌ను అధికారులు మూసివేసి ట్రాఫిక్‌ క్లియరెన్సు చేపట్టారు.  ట్రాఫిక్‌ నిలిచిపోవడంతోప్రయాణికులు, బైక్‌ చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  శుక్రవారానికి ఇంకా 1000కిపైగా కార్లు నిలిచిపోయి ఉన్నట్లు అధికారులు చెప్పారు. వాహనదారులకు ఆహారం, నీరు, ఇంధనం అందిస్తున్నారు. అయితే,  తీవ్రమైన చలి వారిని భయపెడుతోంది.  

మరిన్ని వార్తలు