Social Media Ban in Sri Lanka: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు

3 Apr, 2022 11:27 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో రాజపక్సే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీంతో శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. 

ఇదిలా ఉండగా లంకలో ఇంకా ఆందోళనలు కొనసాగుతుండటంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో సోషల్‌ మీడియాపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ సేవలు నిలిచిపోయాయి. కాగా, దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేదుకే ఇలా చేసినట్టు వివరణ ఇచ్చింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్‌ మీడియా నిషేధంపై ఆదేశాలు జారీ చేసింది. ఇక, అంతకు ముందు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.  

మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్‌ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్‌ అందించిన నాలుగో డీజిల్‌ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు