-

ప్రపంచ పెద్దన్న అమెరికాకు షాక్‌ ఇచ్చిన ద్వీప దేశం.. చైనా అండతోనే?

31 Aug, 2022 14:42 IST|Sakshi

హోనియారా: ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికాకు ఓ చిన్న దేశం గట్టి షాక్‌ ఇచ్చింది. తమ తీరప్రాంత జలాల్లోకి అమెరికాకు చెందిన మిలిటరీ నౌక వచ్చేందుకు నో చెప్పింది. పసిఫిక్‌ దేశమైన సోలమన్‌ ఐలాండ్స్‌ ప్రధాని అధికార ప్రతినిధి ఈ మేరకు వెల్లడించారు. విదేశాలకు చెందిన మిలిటరీ నౌకలు సోలమన్‌ ఐలాడ్స్‌ నౌకాశ్రయాల్లోకి రావటంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.  

దేశంలోని నౌకాశ్రయంలో ఇంధనం నింపుకోవాలని భావించిన అమెరికా కోస్ట్‌ గార్డ్‌ షిప్‌కు అనుమతించలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో నిషేధం అంశాన్ని మంగళవారం వెల్లడించారు సోలమన్‌ ప్రధాని మనస్సే సోగవరే. ‘ఈ నిర్ణయం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక అనుమతి లేదు. నౌకల అనుమతి ప్రక్రియను పునఃపరిశీలించే అంశంపై నిర్ధిష్ట సమయం ఏమీ లేదు.’ అని ప్రధాని ప్రతినిధి తెలిపారు. 

తాత్కాలిక నిషేధం దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మరోవైపు.. ఈ నిర్ణయంతో సోలమన్‌ ఐలాడ్స్‌ తమ మిత్ర దేశం చైనాకు మరింత దగ్గరవుతోందని సూచిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరు దేశాలు భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరోవైపు.. పశ్చిమ దేశాల మీడియా తమ దేశంలో అధికార మార్పిడికి, గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని సోలమన్‌ ఐలాడ్స్ ప్రధాని కార్యాలయం ఇటీవలే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ నౌకలపై తాత్కాలిక నిషేధం విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం.. చినూక్ హెలికాప్టర్లు నిలిపివేత.. ఆందోళనతో భారత్ లేఖ

మరిన్ని వార్తలు