ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్‌లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?

4 Jul, 2022 02:15 IST|Sakshi

బాధితుల్ని కుట్టేలా వైరస్‌లు దోమలకు ఆకర్షణ పెంచుతున్నట్లు వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ చూసి ప్రపంచమంతా భయపడుతున్న వేళ..ఇతర రకాల వైరస్‌ల సామర్థ్యంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వైరస్‌లు ఇతర జీవుల చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగల శక్తి ఉందని తాజాగా తేలింది. కనెక్టికట్‌ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెంగ్వా వాంగ్‌ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు.

దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, గున్యా జ్వరాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్‌ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథేయిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్‌ గుర్తించారు. వైరస్‌ బాధిత జీవి చర్మంపై తయారయ్యే అసిటోఫెనోన్‌ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా దోమలు బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు.

పేగులు, చర్మంపై నుండే బాసిల్లస్‌ బ్యాక్టీరియానే అసిటోఫెనోన్‌ తయారీలో కీలకం. డెంగ్యూ, జికా వైరస్‌లు చర్మంపై నుండే బాసిల్లస్‌ బ్యాక్టీరియా రెల్మా అనే కణ తయారీని అడ్డుకుని అసిటోఫెనోన్‌ను పెంచుతోంది. ప్రయోగంలో చివరిగా వైరస్‌ బాధిత ఎలుకలకు ఎల్మాను ప్రేరేపించే విటమిన్‌ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్‌ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్‌ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు. 

మరిన్ని వార్తలు