భారత నౌకలో 14 మందికి పాజిటివ్‌: అధికారుల టెన్షన్‌

5 May, 2021 13:50 IST|Sakshi

జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌: భార‌త్‌లో క‌రోనా వైర‌స్‌ విలయతాండం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే పలు దేశాలు భారత్‌ నుంచి వెళ్లే విమానాల‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక నౌక‌ల‌పై కూడా ఆంక్ష‌లు విధించేలా పరిణామాలు కన్పిస్తున్నాయి. భార‌త్ నుంచి బియ్యం లోడుతో ఓ భారీ నౌక ద‌క్షిణాఫ్రికాకు చేరుకుంది. అక్కడి పోర్టు అధికారులు నౌక సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా వారికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇటీవల భారత్‌ నుంచి ఓ నౌక సుమారు మూడు వేల ట‌న్నుల‌కు పైగా బియ్యం లోడుతో సాతాఫ్రికాలోని డర్బన్‌ పోర్టుకు చేరుకుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నౌక‌లోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆశ్చర్యంగా అందులో 14 మంది సిబ్బందికి పాటిజివ్‌గా నిర్ధార‌ణ అయిందని ద‌క్షిణాఫ్రికాకు చెందిన‌ ట్రాన్స్‌నెట్ నేష‌న‌ల్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది.

ప్ర‌స్తుతం ఆ నౌకను క్వారంటైన్‌లో ఉంచామని, అందులోకి వెళ్ల‌డానికి, బ‌య‌ట‌కు రావ‌డానికి ఎవ‌రికీ అనుమ‌తి లేద‌ని పోర్టు అధికారులు వెల్ల‌డించారు. నౌకతో ముడిపడి ఉన్న అన్ని కార్యకలాపాలను ప్రస్తుతం నిలిపివేశారు. నౌకలోని సిబ్బందిని ఎవ‌రెవ‌రు క‌లిశార‌నే విష‌యాన్ని గుర్తించే ప‌నిలో అధికారులు నిమగ్నమైనట్లు  తెలిపారు. ఆ నౌకలో గ‌త ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది ప‌నిచేస్తున్న‌ట్లు స్థానిక మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నాయని, వాటిని దింపడానికి ఈ సిబ్బంది పని చేసినట్లు తెలిసింది. భారతదేశంలో రోజూ వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా తీరాలకు చేరిందనే వార్త  ప్రస్తుతం అక్కడి మీడియాలో వైరల్‌గా మారింది.

( చదవండి: 22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్‌ )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు