‘విద్యావంతులైన పురుషులు అత్యాచారం చేయరు’

16 Feb, 2021 14:08 IST|Sakshi

దక్షిణాఫ్రికా విద్యామంత్రి వ్యాఖ్యలపై దుమారం

జోహన్నస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా విద్యాశాఖ మంత్రి ఆంగీ మొషెకా వివాదంలో చిక్కుకున్నారు. ఓ పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా అత్యాచారం గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఇరకాటంలో నెట్టాయి. విద్యావంతులైన పురుషులు లైంగికదాడులకు పాల్పడరంటూ ఆంగీ వ్యాఖ్యానించడంపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌ చేస్తోంది. కాగా దక్షిణాఫ్రికాలో సగటున రోజుకు 110 చొప్పున అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంగీ సోమవారం ప్రిటోరియాలో జరిగిన కార్య క్రమంలో మాట్లాడుతూ.. ‘‘కేవలం విద్య ద్వారానే మనం కొన్ని కఠినతరమైన సవాళ్లను అధిగమించగలం. ఎందుకంటే చదువుకున్న మగవాళ్లు అత్యాచారాలు చేయరు. వారు కాస్త నాగరికుల్లా ప్రవర్తిస్తారు. అలాంటి పనులు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ క్రమంలో ఆంగీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన ప్రతిపక్షం డెమొక్రటిక్‌ అలయన్స్‌ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్‌ చేశాయి. ఆఫ్రికా సంస్కృతి, సంప్రదాయాలను ఆంగీ కించపరిచారని, తక్షణమే ఆమె పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై స్పందించిన ఆంగీ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, లింగ వివక్ష రూపుమాపాలంటే విద్య ఒక్కటే మార్గమని తాను అన్నానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ దుమారం మాత్రం సద్దుమణగడం లేదు.

చదవండిపార్లమెంటులో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం!

మరిన్ని వార్తలు