Omicron-Immunity-Delta: ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్‌!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

31 Dec, 2021 04:25 IST|Sakshi

ఒమిక్రాన్‌ సోకితే పెరుగుతున్న ఇమ్యూన్‌ రెస్పాన్స్‌

సహజ వ్యాక్సిన్‌గా భావిస్తున్న నిపుణులు

పరిస్థితులు అనుకూలిస్తే జలుబు స్థాయికి కరోనా

Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్‌ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్‌ వేరియంట్‌. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్‌ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. 

ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్‌ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్‌ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్‌ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం.

దీనివల్లనే ఒమిక్రాన్‌ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్‌ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్‌ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్‌’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్‌ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది.  

ఏమిటీ పరిశోధన
ఒమిక్రాన్‌ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు.

వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్‌’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్‌ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్‌ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్‌ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు.

అంటే ఒమిక్రాన్‌ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్‌ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్‌ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్‌ సైగల్‌ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్‌ న్యూస్‌!         

విమర్శలు కూడా ఉన్నాయి...
సైగల్‌ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్‌ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్‌ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్‌ పుట్టుకురావచ్చు.

అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్‌ పియర్‌సన్‌ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్‌లాగా ప్రతి ఏటా ఒక సీజనల్‌ కరోనా వేరియంట్‌ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్‌ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్‌ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్‌ మిగిలడం.. అనేవి పియర్‌సన్‌ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు.
 –నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు