వజ్రాల వేటలో జనాలు.. విషాదంగా ముగుస్తుందా?

20 Jun, 2021 14:43 IST|Sakshi

అది దక్షిణాఫ్రికా తీరం వెంట ఉండే ఓ చిన్న ఊరు. వారం క్రితం వరకు ఆ ఊరి గురించి.. పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఓ పశువుల కాపరి ప్రకటన తర్వాత ఆ ఊరి పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. దేశం నలమూలల నుంచి అక్కడికి ‘క్యూ’ కడుతున్నారు. ఎందుకోసం అనుకుంటున్నారు వజ్రాల వేట కోసం..

ప్రిటోరియా: క్వాహ్లాతి.. సౌతాఫ్రికాలో ఓ చిన్న కుగ్రామం. ఆ ఊరి శివారులో ఉన్న భూముల్లో వారం క్రితం ఓ గొర్రెల కాపరికి మెరిసే రాళ్లు దొరికాయి. అవి వజ్రాలేనని ప్రచారం మొదలుకావడంతో జనాలు ఎగబడి మరీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పదులు.. వందలు.. వేల మంది అక్కడికి చేరుకున్నారు. తమ దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రంగు రంగుల రాళ్లు వాళ్లకు దొరుకుతున్నాయి.

అధికారులకు కరోనా భయం
కాగా, తవ్వకాల్ని కట్టడి చేయడంలో అక్కడి అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది ఒకేసారి తవ్వకాలు చేపడుతుండడంతో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వాళ్లలో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. ‘మీకు చేతులెత్తి మొక్కుతాం. తవ్వకాలు ఆపండి. మాకు సహకరించండి. ఆశతో ప్రాణల మీదకు తెచ్చుకోవద్దు’ అని మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఆశచావని ప్రజలు
కరోనా ఎఫెక్ట్‌తో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం అయ్యింది. లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. ఈ తరుణంలో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు ప్రజలు. అయితే వారం గడుస్తున్నా అవి వజ్రాలేనా? అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమయ్యారు. అయినప్పటికీ ఆశ చావని ప్రజలు.. వేటను కొనసాగిస్తూనే ఉన్నారు.  

మరిన్ని వార్తలు