South Africa:ఎటు చూసినా దోపిడీలు.. తొక్కిసలాటలో పోతున్న ప్రాణాలు!

17 Jul, 2021 14:10 IST|Sakshi

ఎటు చూసినా గుంపులుగా జనం, దొపిడీలు, తగలబడుతున్న కాంప్లెక్స్‌, మిగిలిపోయిన శిథిలాలు.. బంగారు నేల దక్షిణాఫ్రికా అల్లకల్లోలంగా తయారైంది. కరోనాతో దీనావస్థకు చేరిన జనాల్లో, మాజీ అధ్యక్షుడు జాకోబ్‌ జుమా అరెస్ట్‌తో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనకారులు కొందరు రొడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తుండగా.. ఇదే అదనుగా దొపిడీలకు పాల్పడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో క్రూరమృగాల సంచారం వార్తలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

సాక్క్షి, వెబ్‌డెస్క్‌: తర్గత సంక్షోభంతో దక్షిణాఫ్రికా పరిస్థితి అధ్వానంగా తయారైంది. కరోనా మూడో వేవ్‌ మధ్యలో కొట్టుమిట్టాడడం, మునుపెన్నడూ లేనంతగా పెరిగిన నిరుద్యోగం-పేదరికం రేటు జనాలకు నిరసనలు బలాన్నిచ్చాయి. ఒక్కసారిగా రోడ్ల మీద పడి దొపిడీలకు పాల్పడ్డారు.  వయసు భేధాల్లేకుండా ఆహారం, లిక్కర్‌, డబ్బులు, మందులు.. ఇలా అన్నీ దొంగతనం చేస్తున్నారు. పనిలో పనిగా కాంప్లెక్స్‌లను తగలబెడుతున్నారు. ఇప్పటిదాకా 212 మంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీళ్లలో చాలామంది దొపిడీలకు పాల్పడినప్పుడు తొక్కిసలాటలోనే చనిపోయారని తెలిపింది. డర్బన్‌, పీయెటెర్‌ మార్టిజ్‌బర్గ్‌ల్లో జుమా గతంలో పోటీ చేసిన క్వాజులు నాటల్‌, గౌటెంగ్‌లలో ఈ విధ్వంసం భారీగా కొనసాగుతోంది. ఈ రెండు ప్రావిన్స్‌ల్లో ఇప్పటిదాకా సుమారు 2500 మందిని అరెస్ట్‌ చేశారు.

వీధుల్లోకి మృగాలు
ఇక ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు క్వాజులు-నాటల్‌ ప్రావిన్స్‌లోని హ్లూహ్లూవే రిజర్వ్‌ కంచెను తెంచేయడంతో.. సింహాలు, ఖడ్గమృగాలు, ఏనుగులు, చిరుత పులులు రోడ్ల మీదకు దూసుకొచ్చినట్లు కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వాటిలో చాలావరకు పాతవని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. ‘‘జంతువులు సంచరించిన మాట వాస్తవమేనని, అది తరచూ జరిగేదేనని, కానీ, సంబంధం లేకుండా కొందరు వాటిని అల్లర్లతో ముడిపెడుతున్నారని, సౌతాఫ్రికాలో ఏదో జరిగిపోతోందన్న ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. 

వారం దాటేసి.. 
దక్షిణాఫ్రికాకు తొమ్మిదేళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశాడు జాకబ్‌ జుమా. అయితే పేదల పెన్నిధిగా పేరున్న జుమాపై సంచలనమైన ఆరోపణలు వచ్చాయి. 12 నేరాల జాబితాలో ఎట్టకేలకు కటకటాల వెనక్కి పంపగలిగింది రామఫోసా ప్రభుత్వం. దీంతో పెద్ద ఎత్తున్న వ్యతిరేక ఉద్యమం మొదలైంది. జనాలు భారీ ఎత్తున్న దొపిడీలకు పాల్పడుతుండడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే నిరసకారుల్ని, ప్రజల్ని అదుపు చేయడం పోలీస్‌ దళాలకు వల్ల కాలేదు. దీంతో జులై 12 నుంచి సైన్యం రంగంలోకి దిగింది.

ఈ లోపు జుమా దాఖలు చేసిన రీ-పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ పరిణామంతో జుమాకు పట్టున్న ముఖ్యపట్టణాల్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇక ఇదంతా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న దాడులేనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్‌ రామఫోసా ఆరోపిస్తున్నారు. అల్లర్ల అదుపునకు మరో వారం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు