అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి

5 Sep, 2021 14:15 IST|Sakshi

దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న సంఘటన

వైరలవుతోన్న శిశువు ఫోటోలు

డబ్లిన్‌: బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఎంతటి సంతోషాన్నిస్తుందో మాటల్లో వర్ణించడం కష్టం. అయితే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆనందిస్తుంది.. అలా కాక ఏదైనా అనారోగ్య సమస్యతో జన్మిస్తే.. తల్లి హృదయం తల్లడిల్లుతుంది. ఇదే పరిస్థితి ఎదురయ్యింది దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళకు. ఆమెకు జన్మించిన బిడ్డను చూసి జనాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ సదరు మహిళ మాత్రం ఏం స్పందించడం లేదు. కారణం ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదు. ఇక ఆమెకు జన్మించిన చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తుంది. తల్లికంటే పెద్ద వయసు ఉన్న మహిళలా కనిపిస్తున్న ఆ చిన్నారి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు..

దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్‌లోని లిబోడ్‌కు చెందిన గ్రామంలో మానసిక వికలాంగురాలైన 20 ఏళ్ల మహిళ ఈ ఏడాది జూన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టం కొద్ది ఆ చిన్నారి అత్యంత అరుదైన వైద్య సమస్యతో జన్మించింది. ఆ చిన్నారి ప్రొజీరియా (హచిన్సన్-గిల్‌ఫోర్డ్ సిండ్రోమ్ అని కూడా పిలువబడుతుంది) తో బాధపడుతోంది. (చదవండి: వయసు 18.. శరీరం 144 ఏళ్లు! పోరాడి ఓడిన అమ్మాయి)

ఈ వ్యాధి వల్ల చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా అరుదైన, ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి. దీని వల్ల పిల్లలు వేగంగా వృద్ధాప్యం బారిన పడతారు. చిన్నారి పుట్టిన వెంటనే తనలో ఏదో లోపం ఉందని ఆమె అమ్మమ్మ గుర్తించింది. అప్పుడే జన్మించిన చిన్నారి ముఖం ముడతలు పడి.. వృద్ధురాలిలా కనిపించడం బాలిక అమ్మమ్మను కలవరపెట్టింది.  

దాంతో పాప అమ్మమ్మ బిడ్డను, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని, ఆమె తల్లిని పరిశీలించిన వైద్యులు.. తల్లి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల వల్లే చిన్నారికి ఈ వింత వ్యాధి సోకిందని తెలిపారు. ఇక ఈ చిన్నారి ఈ ఏడాది జూన్‌లో జన్మించింది. అయితే పాప ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ తర్వాతే చిన్నారి జననం, పాప ఎదుర్కొంటున్న అరుదైన పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. (చదవండి: తగలబడుతున్న బంగారు నేల.. ఊళ్లోకి క్రూరమృగాలు?)

ప్రస్తుతం తూర్పు కేప్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యుడిగా ఉన్న సిఫోకాజి మణి లుసితి, ప్రొజిరియాతో జన్మించిన చిన్నారికి తగిన సాయం, మద్దతు అందించాలని.. నవజాత శిశువును ఎగతాళి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నవజాత శిశువు పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయం అందించడానికి సాంఘిక అభివృద్ధి శాఖ నుంచి అనేక మంది సీనియర్ అధికారులు చిన్నారి ఇంటిని సందర్శించారు.

మరిన్ని వార్తలు