ఒక్క గంటలో ‍అత్యధిక కప్పుల ‘టీ’ తయారు.. మహిళకు గిన్నిస్‌ రికార్డ్‌

19 Oct, 2022 15:15 IST|Sakshi

కేప్‌టౌన్‌: చాయ్‌ అంటే ఒక పానీయమే కాదు అది చాలా మంది జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉదయం లేవగానే కప్పు టీ లేకుండా ఉండటాన్ని ఊహించలేని స్థాయిలో దానికి ఆదరణ లభించింది. ఇంటికి ఎవరైనా బంధవులచ్చినప్పుడు ముందుగా టీ తాగుతారా? అని అడుగుతారు. క్షణాల్లోనే తీసుకొచ్చి ఇస్తుంటారు. అయితే.. అదే టీ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేయొచ్చని మీకు తెలుసా? ఓ మహిళ ‍చేసి చూపించారు. ఒక్క గంటలోనే ఎక్కువ కప్పుల టీ చేసి ఈ ప్రపంచ రికార్డును తన పేరు లిఖించుకున్నారు.

దక్షిణాఫ్రికాలోని వుప్పెర్థల్‌ ప్రాంతానికి చెందిన ఇంగర్‌ వలెంటైన్‌ అనే మహిళ ఈ ఫీట్‌ను సాధించారు. స్థానికంగా లభించే ‘రూయ్‌బోస్‌’ అనే టీని తయారు చేయటం ద్వారా తమ దేశ పర్యటక, ట్రావెల్‌ రంగాలను బలోపేతం చేయాలని భావించి ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఇంగర్‌ వలెంటైన్‌ మూడు రకాల రుచులు వెన్నిల, స్ట్రాబెర్రీ, ఒరిజినల్‌ టీని ఉపయోగించారు. రికార్డు సాధించేందుకు గంట సమయంలో 150 కప్పుల టీని తయారు చేయాల్సి వచ్చింది. ఇందులో ఓ మెలిక సైతం ఉంది. ఒకే టీ తయారీ పాత్ర ఉపయోగించాలి, కొన్ని కప్పులు వాడాలి.

దీంతో ఆమె ఓ స్ట్రాటజీని వాడి.. ఈ ఫీట్‌ను పూర్తి చేశారు. పాత్రలో ఒకేసారి నాలుగు టీ బ్యాగులు వేసి రెండు నిమిషాల పాటు వాటిని కరిగించారు. దానిని నాలుగు కప్పుల్లో పోశారు. ఆ తర్వాత మళ్లీ రిపీట్‌ చేశారు. ఆమెకు స్థానిక విద్యార్థులు సైతం సాయంగా నిలిచారు. చేసిన టీ చేసినట్లు తాగుతూ కప్పులు కడిగి మళ్లీ ఇంగర్‌కు అందించే వారు. ఇలా ఒక్క గంట సమయంలోనే 249 కప్పుల టీని తయారు చేయటమే కాదు.. దానిని విద్యార్థులు తాగేలా చేశారు. అంటే ఒక్క నిమిషానికి నాలుగు కప్పుల టీని తయారు చేసినట్లన్నమాట.

ఇదీ చదవండి: మోడ్రన్‌ కృష్ణుడు.. తన మ్యూజిక్‌తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు