దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్‌ పాజిటివ్‌

14 Dec, 2021 05:22 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా(69) కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్‌టౌన్‌లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్‌ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది.

ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్‌ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఒమిక్రాన్‌ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు