శాస్త్రవేత్తల ఘనత: ‘వైర్‌లెస్‌ పవర్‌’తో కేబుల్స్‌ లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్!

31 Aug, 2022 19:12 IST|Sakshi

సియోల్‌: ఫోన్‌, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఛార్జింగ్‌ అయిపోతే చికాకు పడతారు. ఛార్జింగ్‌ పెట్టేందుకు కేబుల్‌ కోసం వెతుకుతారు. ఇంట్లో ఉంటే పర్వాలేదు.. కానీ వేర ప్రదేశానికి వెళ్లినప్పుడు కేబుల్స్‌ను తీసుకెళ్లటం కొంత భారంగానే ఉంటుంది. అయితే.. ఇకపై ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎలాంటి కేబుల్స్‌ లేకుండానే విద్యుత్తు సరఫరా చేసే ప్రయోగంలో తొలి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. దక్షిణ కొరియాలోని సెజోంగ్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ‘వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశారు. 

ఇన్‌ఫ్రారెండ్‌ లైట్స్‌ ద్వారా సురక్షితంగా పవర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసి చూపించారు. 30 మీటర్ల దూరంలోని సెన్సార్లకు ఛార్జింజ్‌ చేసేందుకు 400 మిల్లీవాట్ల పవర్‌ను ఈ వ్యవస్థ విజయవంతంగా సరఫరా చేసింది. దీనిని మొబైల్‌ పరికరాలను ఛార్జ్‌ చేసే విధంగా విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ‘పవర్‌ డివైజ్‌లను వైర్‌లెస్‌గా మార్చటం ద్వారా ఫోన్స్‌, టాబ్లెట్స్‌ వంటి వాటికి కేబుల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. అలాగే.. ఐఓటీ పరికరాలు, తయారీ ప్లాంట్లలోని సెన్సెర్లను ఛార్జ్‌ చేయవచ్చు.’ అని పరిశోధన బృంద నాయకుడు జిన్‌యోంగ్‌ హా తెలిపారు.  మరోవైపు.. వైర్‌లెస్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కోసం పలు టెక్నిక్‌లపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. మీటర్ల వ్యవధిలో తగినంత విద్యుత్తును పంపడం సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో.. పరిశోధకులు 'డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్' అనే పద్ధతి అన్ని టెక్నిక్‌ల కంటే మేలైనదిగా తేల్చారు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఈ సిస్టమ్‌లోని లైట్‌ను అడ్డుకోనంత వరకు తక్కువ స్థాయి పవర్‌ను సురక్షితంగా పంపించవచ్చని చెప్పారు. 

ఎలా పనిచేస్తుంది?
డిస్ట్రిబ్యూటెడ్‌ లేజర్‌ ఛార్జింగ్ అనేది కొంత వరకు సంప్రదాయ లేజర్‌ లాగానే పని చేస్తుంది. ఒకే వస్తువులో లేజర్‌ పరికరాలను అమర్చకుండా.. ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకే లైన్‌లో ఉండి లేజర్‌ లైట్‌ అనుసంధానమవుతే.. ఈ వ్యవస్థ లైట్‌ ఆధారిత పవర్‌ను లోడ్‌కు సరఫరా చేస్తుంది. ఒకవేళ ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ల మధ్య ఏదైనా అడ్డుపడితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.  

పరిశోధకులు రిసీవర్, ట్రాన్స్‌మిటర్‌లను 30 మీటర్ల దూరం వేరు చేశారు. ట్రాన్స్‌మిటర్ ఎర్బియం-డోప్డ్ ఫైబర్ యాంప్లిఫైయర్ ఆప్టికల్ సోర్స్‌తో తయారు చేశారు. రిసీవర్ యూనిట్‌లో రెట్రో రిఫ్లెక్టర్, ఆప్టికల్ సిగ్నల్‌ను ఎలక్ట్రికల్ పవర్‌గా మార్చే ఫోటోవోల్టాయిక్ సెల్, పవర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రకాశించే ఎల్‌ఈడీ ఉన్నాయి. ఈ వ్యవస్థ విజయవంతంగా విద్యుత్తును ట్రాన్స్‌ఫర్‌ చేసి చూపించింది.

ఇదీ చదవండి: వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం

మరిన్ని వార్తలు