ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన సోవియట్ యూనియన్ నేత మృతి

31 Aug, 2022 07:39 IST|Sakshi

మాస్కో: సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్‌(91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచేవ్.. ప్రచ్ఛన్నయుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. ఏడేళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు.

సోవియట్ యూనియన్‌ అధ్యక్షుడిగా 1985-1991 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపర్చిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా వ్యవహరించారు. తూర్పు యూరప్‌కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది.

తనదైన మార్క్ పాలనతో పశ్చిమ దేశాల్లోనూ మంచి గుర్తింపు సాధించారు గోర్బచేవ్. 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఆయనను వరించింది. అయితే ప్రపంచానికి సూపర్‌పవర్‌గా ఉన్న తమను ఈయనే బలహీనపరిచారని రష్యా నేతల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

రష్యా నేతల్లో 90ఏళ్లకు పైగా జీవించిన తొలి వ్యక్తి గోర్బచేవ్  కావడం గమనార్హం. అందుకే ఆయన 90వ పుట్టినరోజు నాడు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, జర్మన్ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ వంటి అగ్రనేతలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం

మరిన్ని వార్తలు