ఉప గ్రహాలకు ఉప ద్రవం

22 Nov, 2021 04:37 IST|Sakshi

మనం వాడుతున్న సాంకేతికతకు... జీపీఎస్, మొబైల్‌ ఫోన్ల నుంచి అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థల వరకు అంతరిక్షంలో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహాలే కీలకం. మరి ఉన్నట్టుండి వాటికేమైనా అయితే? వామ్మో ఇంకేమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చిపడబోతోందని కాదుకానీ... భూకక్ష్యలో రద్దీ ఎక్కువమవుతోంది. ఎవరి అవసరాని కొద్దీ వారు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు.

ఎలన్‌మస్క్‌ అయితే స్టార్‌లింక్‌ ద్వారా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలకు శ్రీకారం చుట్టేశారు. లెక్కకు మిక్కిలి బుల్లి శాటిలైట్లను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేస్తున్నారు. వీటన్నింటినీ మోసుకెళ్తున్న రాకెట్ల శకలాలు కొన్ని భూమి మీదపడగా... మిగతా కొన్ని విడిభాగాలు అలా భూకక్ష్యలో తేలియాడుతున్నాయి. అలాగే కాలం చెల్లిన శాటిలైట్లు... వాటినుంచి వేరుపడుతున్న విడిభాగాలు కూడా. ఇవే ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి.

రష్యా తాము 1982లో ప్రయోగించిన ‘కాస్మోస్‌–1408’ ఉపగ్రహం నిరర్ధకంగా మారిందని ఈనెల 15వ తేదీన ఓ మిస్సైల్‌ ద్వారా దాన్ని పేల్చివేసింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) 80 కిలోమీటర్ల పైభాగంలో ఇది జరగడం గమనార్హం. భూమి లేదా విమానం నుంచి మిస్సైల్‌ను ప్రయోగించి భూకక్ష్యలోని వెళ్లాక దాని గమనాన్ని నియంత్రించి లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేస్తారు.

రష్యా శాటిలైట్‌ పేలిపోవడంతో 1,500 పైచిలుకు శకలాలు అంతరిక్షంలోకి విరజిమ్మబడ్డాయి. ఎఎస్‌ఎస్‌లోని ఏడుగురు వ్యోమగాములను రెండు గంటలపాటు సురక్షితంగా క్యాప్యూల్స్‌లోకి వెళ్లి తలదాచుకోమని నాసా హెచ్చరించాల్సి వచ్చింది. రష్యా చర్యను తీవ్రంగా ఖండించింది కూడా. గతంలో అమెరికా, చైనా, భారత్‌లు కూడా ఇలాగే భూకక్ష్యలోని తమ పాత ఉపగ్రహాలను పేల్చేశాయి.  

ఎంత చెత్త ఉంది...
భూమి దిగువ కక్ష్యలో దాదాపు 9,600 టన్నుల చెత్త (విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, నట్లు, బోల్టులు తదితరాలు) పేరుకుపోయిందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) అంచనా. సాఫ్ట్‌ బాల్‌ సైజులో ఉన్న భాగాలు 23 వేలు ఉంటాయని నాసా లెక్క. సెంటీమీటరు పరిమాణంలో ఉండేవి ఐదు లక్షల పైచిలుకే ఉంటాయి. ఇవి గంటకు ఏకంగా 25,265 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంటాయి. ఈ శకలాలు ఒకరోజులో భూమి చుట్టూ 15 నుంచి 16 సార్లు పరిభ్రమిస్తాయి. ఈ వేగంతో వెళుతున్నపుడు ఎంత చిన్నశకలమైనా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొడితే కలిగే నష్టాన్ని ఊహించగలమా? విస్పోటం లాంటిది సంభవించే అవకాశం ఉంటుంది.

శాటిలైట్‌లను తాకితే అవి తునాతునకలైపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణంగా భూమికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తుల్లో కక్ష్యలో సమాచార, పరిశోధక ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. వీటికి ఈ మానవ జనిత చెత్త, శకలాల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. మునుముందు శాటిలైట్‌ ప్రయోగాలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి కాబట్టి... చెత్త పేరుకుపోయే... ముప్పు మరింత పెరుగుతుంది.  భూకక్ష్యను దాటివెళ్లే అంతరిక్ష ప్రయాణాలకు వీటివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు.

భూమి కక్ష్యలో 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే చెత్త క్రమేపీ కొన్నేళ్లలో కిందికి దిగజారుతూ భూమిపైకి పడిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చెబుతోంది. కాకపోతే వెయ్యి కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించే శకలాలే 100 ఏళ్లు.. ఇంకా అంతకుపైనే తిరుగుతూ ఉంటాయట. వీటితోనే ముప్పు. పైగా భవిష్యత్తులో ఇలాంటి శకలాల నుంచి ముప్పు తప్పించుకునే సాంకేతికతలను శాటిలైట్‌లకు జోడించాలంటే మొత్తం ప్రాజెక్టు వ్యయం 5 నుంచి 10 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తానికి భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ మానవ జనిత చెత్తతో మనకు చిక్కొచ్చిపడుతోంది!  

– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు