SpaceX Inspiration 4: ప్రయోగం సక్సెస్‌.. అంతరిక్షం ఇక అందరిదీ 

20 Sep, 2021 08:15 IST|Sakshi
యాత్రికుల విజయదరహాసం 

సురక్షితంగా వెనక్కివచ్చిన స్పేస్‌ఎక్స్‌ పర్యాటకుల వ్యోమనౌక 

కేప్‌ కెనవెరాల్‌: మూడు రోజుల పాటు ముచ్చటగా సాగిన ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. అపర కుబేరుడు జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్‌ నేతృత్వంలో నలుగురు పర్యాటకులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక సురక్షితంగా భూమికి చేరింది. ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్‌ మహా సముద్రంలో శనివారం సాయంత్రం స్పేస్‌ఎక్స్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఇన్‌స్పిరేషన్‌–4 పేరుతో నిపుణులైన వ్యోమగాములెవరూ లేకుండా సాధారణ పౌరులతో కూడిన ఈ యాత్ర విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరిన్ని పర్యాటక రోదసి యాత్రలకు బాటలు వేసినట్టయింది.

ఈ యాత్రని స్పాన్సర్‌ చేసిన ఐసాక్‌ మ్యాన్‌ స్పేస్‌ఎక్స్‌కు ఎంత చెల్లించారో వెల్లడించలేదు. స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ తమ కంపెనీ రాకెట్‌ ద్వారా మొదటిసారి పర్యాటకుల్ని పంపిన ఘనతని సాధించారు. స్పేస్‌ఎక్స్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా భూమ్మీదకి చేరగానే ‘‘మీ మిషన్‌తో అంతరిక్షం మన అందరిదీ’’అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టయిందని స్పేస్‌ఎక్స్‌ మిషన్‌ కంట్రోల్‌ నినదించింది. ఈ ప్రయాణంలో వారు తినడానికి కోల్డ్‌ పిజ్జా, శాండ్‌విచెస్, పాస్తా, గొర్రె మాంసం తీసుకువెళ్లారు.

                                    పారాచ్యూట్ల సాయంతో నీటిపైకి దిగుతున్న క్యాప్సుల్‌   

అంతరిక్షం ఓ అద్భుతం 
అమెరికాలోని ఫ్లోరిడాలో కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం రాత్రి స్పేస్‌ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 585 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టింది. ఈ క్యాప్సుల్‌కి అతిపెద్ద బబుల్‌ ఆకారంలో ఉన్న కిటికీని అమర్చారు. ఈ గాజు కిటికీ ద్వారా అందులో ప్రయాణించిన జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్, కేన్సర్‌ నుంచి కోలుకున్న హేలి అర్సెనాక్స్, డేటా ఇంజనీర్‌ క్రిస్‌ సెంబ్రోస్కీ, జియో సైంటిస్ట్‌ సియాన్‌ ఫ్రాక్టర్‌లు అంతరిక్షాన్ని తనివితీరా చూశారు. అలా అంతరిక్షాన్ని చూడడం ఒక అద్భుతమని ఐసాక్‌మ్యాన్‌ చెప్పారు. రోదసి యాత్ర ముగించుకొని తిరిగి వచ్చాక వారి ఆరోగ్యం బాగానే ఉందని స్పేస్‌ ఎక్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ బెంజి రీడ్‌ తెలిపారు. 

చదవండి:
చరిత్ర సృష్టించనున్న ఎలన్‌ మస్క్‌..!
క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది

 

మరిన్ని వార్తలు