అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు

17 Sep, 2021 05:46 IST|Sakshi
రాకెట్‌ క్యాప్సూ్యల్‌లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు

వ్యోమగామియేతర ప్రయాణికులతో మొదలైన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయాణం

మూడు రోజుల అంతరిక్ష పర్యాటక యాత్ర షురూ

అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌

కేప్‌ కనావెరల్‌ (అమెరికా): వ్యోమగాములు లేకుండా, ఎలాంటి అంతరిక్ష యాత్రల అనుభవంలేని సాధారణ పౌరులతో తొలిసారిగా స్పేస్‌ టూరిజానికి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌తో శ్రీకారం చుట్టారు. ఇన్‌స్పిరేషన్‌–4 పేరిట మూడు రోజుల పాటు కొనసాగే ఈ అంతరిక్ష యాత్ర పూర్తి వ్యయ ప్రయాసల బాధ్యతలను అమెరికా కుబేరుడు, ఫిష్ట్‌4 పేమెంట్స్‌ సంస్థ అధినేత జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్‌ తన భుజాలకెత్తుకున్నారు.

ముగ్గురు ప్రయాణికులతోపాటు తానూ స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌లో కూర్చుని అంతరిక్ష యాత్రకు పయనమయ్యారు. ప్రొఫెషనల్‌ వ్యోమగాములే లేని ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరిట్‌ ద్వీపంలో ఉన్న కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం గం.5.32 నిమిషాలకు ధవళవర్ణ స్పేస్‌సూట్లు ధరించిన క్రిస్‌ సెమ్‌బ్రోస్కీ, జేర్డ్‌ ఐసాక్‌మ్యాన్, సియాన్‌ ప్రోక్టర్, హేలే ఆర్సేనెక్స్‌లతో స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌–9 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది. చదవండి: బిడ్డకు భర్త పేరు పెట్టుకున్న యూఎస్‌ అమర సైనికుని భార్య

ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో మొదలైన ఈ ప్రయాణంలో రాకెట్‌ ఆకాశంలో దాదాపు 160 కి.మీ.ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించనుంది. మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ రాకెట్‌ గమనాన్ని ఆటోపైలట్‌మోడ్‌లో భూమి మీద నుంచే నియంత్రిస్తారు. తన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా కేవలం సాధారణ పౌరులనే నింగిలోకి పంపి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం అంతరిక్ష టూరిజం రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. నేరుగా అంతరిక్ష ప్రయాణం చేసిన మూడో బిలియనీర్‌గా ఈ–కామర్స్‌ దిగ్గజం ఐసాక్‌మ్యాన్‌ చరిత్రలకెక్కారు. ఈ జూలై నెలలోనే ఇప్పటికే తమ సొంత రాకెట్లలో వర్జిన్‌ గెలాక్టిక్‌ యజమాని రిచర్డ్‌ బ్రాన్సన్, బ్లూ ఆరిజిన్స్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షయానం చేసి అంతరిక్ష పర్యాటక యాత్రల పరంపరను మొదలుపెట్టడం తెల్సిందే.  

తర్వాతి ప్రయాణాలకు మార్గదర్శకంగా..
ఈ ప్రయాణం విజయవంతమైతే దీనిని తదుపరి సాధారణ ప్రయాణికుల పర్యాటక యాత్రలకు మార్గదర్శకంగా భావించనున్నారు. మూడు రోజుల యాత్రలో భాగంగా ఈ నలుగురి ఆరోగ్య స్థితిని అంతరిక్షంలో పరీక్షించనున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం, మేథో శక్తి, నిద్ర, రక్త ప్రసరణ తదితర అంశాలనూ పరిశీలించనున్నారు.  ప్రయాణాన్ని వారు మరింతగా ఆస్వాదించేందుకు వీలుగా స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ పై భాగంలో తొలిసారిగా అతిపెద్ద డోమ్‌ విండోను ఏర్పాటుచేశారు. ‘ఇది అద్భుతం’ అని ఐసాక్‌మ్యాన్‌ వ్యాఖ్యానించారు. డ్రాగన్‌ క్యాప్సూల్‌లో ప్రయాణంలో సమస్యలొస్తే ఎలా ఎదుర్కోవాలో వివరిస్తూ వీరందరికీ వాషింగ్టన్‌లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారు.  

వచ్చే ఏడాది తొలినాళ్లలో మరో ట్రిప్‌
ముగ్గురు అత్యంత ధనవంతులైన ప్రయాణికులు, ఒక మాజీ నాసా వ్యోమగామితో వారంపాటు కొనసాగే మరో అంతరిక్ష పర్యాటక యాత్ర వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉంటుందని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది. రష్యాకు చెందిన నటి, దర్శకుడు, జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం ఈ యాత్రలో పాలుపంచుకుంటారని పేర్కొంది. చదవండి: చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..!

ఇద్దరు విజేతలు, ఒక హెల్త్‌కేర్‌ వర్కర్, ఒక కుబేరుడు
నలుగురితో మొదలైన ఈ ఇన్‌స్పిరేషన్‌–4 యాత్రలో హేలే ఆర్సేనెక్స్‌ అనే 29 ఏళ్ల మహిళా హెల్త్‌కేర్‌ వర్కర్‌ ఉన్నారు. ఎముక క్యాన్సర్‌ బారినపడి కోలుకున్న ఈమె తాను చికిత్సపొందిన టెన్నెస్సీలోని పరిశోధనా వైద్యశాలలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన అత్యంత పిన్న అమెరికన్‌గా ఈమె రికార్డు సృష్టించారు. ప్రయాణికుల్లో ఒకరైన ఐసాక్‌మ్యాన్‌ ఈ ఆస్పత్రికి 10 కోట్ల డాలర్ల విరాళం ఇచ్చారు. వాషింగ్టన్‌లో డాటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న క్రిస్‌ సెమ్‌బ్రోస్కీ(42) సైతం యాత్రలో పాలుపంచుకున్నారు. ఆరిజోనాలోని కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌ అయిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ మహిళ సియాన్‌ ప్రోక్టర్‌(51) సైతం ఈ యాత్రకు ఎంపికయ్యారు. ప్రయాణికుల ఎంపిక కోసం జరిగిన పోటీలో క్రిస్, ప్రోక్టర్‌లు విజేతలుగా నిలిచారు.

నింగిలోక దూసుకెళ్తున్న ఫాల్కన్‌ రాకెట్‌

మరిన్ని వార్తలు