‘మత్తు’.. ప్రపంచమంతా.. ఇప్పుడు అప్పుడని కాదు

19 Apr, 2022 04:54 IST|Sakshi

అదో నిశ్శబ్ద మహమ్మారి.. బడీడు వయసు పిల్లల నుంచి సమాజంలో మంచి హోదా ఉన్న ప్రముఖుల దాకా.. ‘మత్తు’గా మింగేస్తున్న డ్రగ్స్‌ రక్కసి. సరదాగా అంటూ మొదలుపెట్టి దానిని వదలలేక చిత్తయిన బతుకులెన్నో.. ఒళ్లు గుల్లబారిపోయి చావలేక, బతకలేక జీవచ్ఛవాలుగా గడుపుతున్న వారెందరో.. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల భూతం పంజా విసురుతూనే ఉంది. రాష్ట్రంలో ఇటీవలే ఓ యువకుడు డ్రగ్స్‌ మితిమీరి తీసుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం, డ్రగ్స్‌ మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ప్రపంచవ్యాప్తంగా వేల ఏళ్ల నుంచీ మాదక ద్రవ్యాల వినియోగం ఉంది. సుమారు ఆరేడు వేల ఏళ్ల కింద.. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న కాలంలోనే డ్రగ్స్‌ వినియోగం మొదలైనట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెప్తున్నారు. పలు శారీరక, మానసిక అనారోగ్యాలకు అవి ఉపశమనం ఇస్తున్నట్టు తర్వాతి కాలంలో గుర్తించారు. మైగ్రేన్, పంటినొప్పి, ఆస్తమా, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలకు చికిత్సలో వాటిని వినియోగించేవారు. ఇటీవల మరింత ప్రమాదకరమైన ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి కృత్రిమ డ్రగ్స్‌ వాడకం ఎక్కువైందని అంటున్నారు.

కరోనాతో కలిసి.. మరో మహమ్మారిగా.. 
ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం ఎంతగా ఉన్నా.. కరోనా, లాక్‌డౌన్లు, తదనంతర పరిణామాలతో ఇది కూడా ఒక మహమ్మారిగా మారిపోయింది. లాక్‌డౌన్లతో నెలలకు నెలలు ఇళ్లకే పరిమితం కావడం, ఉద్యోగాలు, వ్యాపారాల్లో నష్టాలు, తీవ్ర మానసిక ఆందోళన వంటివి డ్రగ్స్‌ వాడకం పెరగడానికి కారణమైంది. 

 చైనాలో  నల్లమందు.. 
క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల కిందే అంటే.. ఏడువేల ఏళ్ల కిందటే సుమేరియన్, చైనా నాగరికతల్లో ఓపియం, గంజాయి (కన్నాబిస్‌) డ్రగ్స్‌ వినియోగంలో ఉన్నట్టు చరిత్రకారులు గుర్తించారు. ఆధునిక యుగానికి వస్తే.. సుమారు 15వ శతాబ్దం కాలం నుంచే దక్షిణాసియా దేశాల్లో గంజాయి వినియోగంలో ఉండేది. బ్రిటీష్, ఫ్రాన్స్, ఇతర యూరప్‌ దేశాలు.. చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలను పాలించిన కాలంలో ఇక్కడికి నల్లమందు (ఓపియం)ను తీసుకొచ్చారు. ఇక్కడ పండించి తరలించుకెళ్లేవారు. 

19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశా ల్లో ఓపియం, మరిజువానా, కొకైన్‌ వంటివి వాడేందుకు చట్టపరంగానే అనుమతులు ఉండే వి. కానీ ఈ డ్రగ్స్‌ వల్ల తలెత్తుతున్న దుష్ప్రభావాలపై వైద్యులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరించడంతో.. నిషేధాలు మొదలయ్యాయి.

 దేశంలోనూ  విపరీతంగా.. 
మన దేశంలోనూ డ్రగ్స్‌ తయారీ, వినియోగం భారీగా సాగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. 2020లో దేశంలో 51,101 డ్రగ్స్‌ కేసులు నమోదుకాగా, 67,267 మంది అరెస్టయ్యారు. 3.9 లక్షల కిలోల గంజాయి, 3వేల కిలోల ఓపియం, 2 వేలకిలోకుపైగా హశిష్, 3 వేల కిలోల హెరాయిన్, రెండున్నర కోట్ల కృత్రిమ డ్రగ్స్‌ ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. 

దేశం ముఖ్యంగా ముంబై అతిపెద్ద డ్రగ్‌ మార్కెట్‌గా కొనసాగుతోంది. ఒక్క 2021 సంవత్సరంలోనే అక్కడి పోలీసులు 7,682 కేసులు నమోదు చేసి, 4,050 కిలోల డ్రగ్స్‌ను పట్టుకోవడం గమనార్హం. 

వినియోగంపరంగా చూస్తే దేశంలో పంజాబ్‌ టాప్‌లో ఉంది. అక్కడ 30 లక్షల మంది డ్రగ్‌ యూజర్లు ఉన్నట్టు అంచనా. 2017 నుంచి ఇప్పటివరకు డ్రగ్స్‌ కేసుల్లో 66,859 మంది అరెస్టవడం గమనార్హం.  

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ.. ఎలా?
ఉగ్రవాదం, అంతర్యుద్ధాలు.. ఈ రెండూ డ్రగ్స్‌ సామ్రాజ్యానికి పునాదులు. నిధుల కోసం ఉగ్రవాద సంస్థలు, మిలీషియాలు, కొన్నిచోట్ల స్వయంగా దేశాల ప్రభుత్వాలే డ్రగ్స్‌ తయారీ, విక్రయాల బాట పట్టాయి. 

మొత్తం ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాల్లో గంజాయి, దాని ఉత్పత్తుల వినియోగమే ఎక్కువ. భారతదేశంలో హెరాయిన్‌ ఎక్కువగా వాడుతారని, ఇటీవల గంజాయి వినియోగం పెరిగిందని యూఎన్‌ పేర్కొంది.

 డ్రగ్స్‌ లెక్కలివీ.. 
2019 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది గంజాయి వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 4 శాతం. ఇక కొకైన్‌ను రెండు కోట్ల మంది (0.4 శాతం) వాడుతున్నారు. 
2019లో డ్రగ్స్‌ కారణంగా సుమారు 5 లక్షల మంది చనిపోయారు. 
2020–21లో ప్రపంచవ్యాప్తంగా 27.5 కోట్ల మంది డ్రగ్స్‌ను వినియోగించారు. ఇందులో 36 లక్షల మంది తీవ్రమైన అనారోగ్యం, ఇతర సమస్యల బారినపడ్డారు. 
కరోనా ప్రభావం చూపిన గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం దాదాపు 20 శాతం పెరిగింది. 
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 3–4 కోట్ల మంది డ్రగ్స్‌ బారినపడతారని అంచనా. 
డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ చికిత్సలో వినియోగించే మెథడోన్‌ వంటి మందులు 50 శాతం దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. 
ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల కోటి మందికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సి, ఇతర వ్యా ధులు సోకినట్టు యూఎన్‌ నివేదిక పేర్కొంది. 
మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్యలు, గృహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్‌ వినియోగమే మూల కార ణమవుతోంది.
(‘ఐక్యరాజ్యసమితి ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యూఎన్‌ఓడీసీ)’నివేదిక 2021 ప్రకారం..) 

డ్రగ్‌ వార్‌
ముందు నేలపై పడుకున్న చిన్నారి.. వెనకాల రెండు శవపేటికలు.. మధ్యలో విషాదంగా చూస్తున్న నిండు గర్భిణి.. ఫిలిప్పీన్స్‌లో డ్రగ్స్‌ వ్యవహారం, దానిపై ప్రభుత్వ యుద్ధానికి విషాద సూచిక ఇది. ఆమె పేరు ఎలిజబెత్‌ నవారో. 2019లో డ్రగ్స్‌ ముఠాలు, సైన్యం మధ్య కాల్పుల్లో ఆమె భర్త మనోస్కా, ఐదేళ్ల కొడుకు ఫ్రాన్సిస్‌ చనిపోయారు. వెనకాల ఉన్న శవపేటికలు వారివే. భర్త, కొడుకు చనిపోయి.. కళ్లముందు ఒక చిన్నారి, కడుపులో మరో చిన్నారిని పెట్టుకుని.. రోదిస్తున్న ఆమె చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

 డ్రగ్స్‌ బాట పట్టకుండా  ‘రియల్‌’ 
స్పెయిన్, అమెరికా, మెక్సికో వంటి దేశాల్లో పిల్లలు, యువత డ్రగ్స్‌ బారినపడకుండా.. నాలుగంచెల ‘మాంటెంటె రియల్‌ (రెఫ్యూజ్, ఎక్స్‌ప్లెయిన్, అవాయిడ్, లీవ్‌)’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి స్కూలు, కాలేజీలో టీచర్ల ఆధ్వర్యంలో మూడు నెలల పాటు దీనిని బోధిస్తున్నారు.  
(రెఫ్యూజ్‌): డ్రగ్స్‌ తీసుకోకుండా పిల్లలు, యువతలో అవగాహన కల్పించడం. 
(ఎక్స్‌ప్లెయిన్‌): మాదకద్రవ్యాల వల్ల వచ్చే అనర్థాలు, సమస్యలను క్షుణ్నంగా వివరించడం. 
(అవాయిడ్‌): డ్రగ్స్‌ అందుబాటులో ఉన్నా, ఎవరైనా ఒత్తిడి తెచ్చినా.. కచ్చితంగా ‘నో’అని చెప్పి దూరంగా వెళ్లిపోవడం. 
(లీవ్‌): ఒకవేళ ఇప్పటికే డ్రగ్స్‌ వాడటం మొదలుపెట్టి ఉంటే తక్షణమే ఆ అలవాటును వదిలేయడం. 
గతంలో డ్రగ్స్‌తో అతలాకుతలమైన కొలంబియా దేశంలోనూ సీక్యూసీ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. ఓ వైపు డ్రగ్స్‌ తయారీ, రవాణా, విక్రయాలను అరికడుతూనే.. మరోవైపు వినియోగం తగ్గించేలా అవగాహన కల్పిస్తున్నారు. 

 ఫిలిప్పీన్స్‌లో  దారుణ యుద్ధం! 
డ్రగ్స్‌ భూతాన్ని అరికట్టేందుకు ఫిలిప్పీన్స్‌ నియంత రొడ్రిగో డ్యుటెర్టె అత్యంత కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్స్‌ రవాణా, విక్రయాలకు పాల్పడినవారినే కాదు.. డ్రగ్స్‌ తీసుకున్నవారినీ కాల్చి చంపేయాలని సైన్యం, పోలీసులకు ఆదేశాలు ఇచ్చాడు. దీనితో గత ఆరేళ్లలో అధికారికంగా 6 వేల మందిని కాల్చేయగా.. అనధికారికంగా 30–40వేల మందిని చంపేసినట్టు అంచనా. ఈ హత్యాకాండపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

రెండు సార్లు చచ్చి.. బతికి.. 
ఇంగ్లండ్‌కు చెందిన ఆయన పేరు లెస్‌ చాండ్లర్‌.. ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు. ఓసారి స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నాడు. కొద్దిరోజుల్లోనే వాటికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే ఓసారి నాలుగు అంతస్తుల భవనంపై నుంచి పడి ఎముకలు విరగ్గొట్టుకున్నాడు. మరోసారి మితిమీరి డ్రగ్స్‌ తీసుకుని గుండెపోటుకు గురయ్యాడు. చాలా రోజులు ఐసీయూలో ఉన్నాడు. గుండెకు పేస్‌మేకర్‌ అమర్చుకోవాల్సి వచ్చింది. శరీరమంతా నిస్సత్తువగా మారింది. డ్రగ్‌ డీఅడిక్షన్‌ చికిత్స తీసుకుని ఆ అలవాటు నుంచి బయటపడ్డాడు. ఇది జరిగి 20 ఏళ్లు అవుతున్నా పూర్తిగా కోలుకోలేని దుస్థితి. అప్పట్లో డ్రగ్స్‌ ఎందుకు తీసుకున్నానా అని ఇప్పటికీ బాధపడుతున్నాడు.  

మరిన్ని వార్తలు