అఫ్గన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రత్యేక విమానం

22 Aug, 2021 10:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అఫ్గన్‌ నుంచి ఓ ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు వచ్చింది. వీరిలో  107 మంది భారతీయులు.. 20 మంది అఫ్గన్‌ హిందువులు, సిక్కులు ఉన్నారు. 168 మందికి ఆర్‌టీపీసీఆర్‌ కరోనా పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపుతామని అధికారులు తెలిపారు.
 

భారతీయుల కిడ్నాప్‌ కలకలం
అఫ్గన్‌లో దాదాపు 150 మందిని తాలిబన్లు అపహరించారని, వారిలో చాలామంది భారతీయులు ఉన్నారంటూ శనివారం వెలువడిన వార్తలు కలకలం రేపాయి. వాస్తవానికి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద విమానం కోసం ఎదురు చూస్తున్న భారతీయులను అఫ్గన్‌ పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించి, ధ్రువపత్రాలను పరిశీలించి, మళ్లీ వదిలేసినట్లు తేలింది.

ప్రస్తుతం వారంతా కాబూల్‌ ఎయిర్‌పోర్టులో క్షేమంగా ఉన్నట్లు సమాచారం. కాబూల్‌ నగరంలోని భారతీయులెవరికీ ఇప్పటిదాకా ఎలాంటి హాని జరగలేదని స్థానిక అధికారులు చెప్పారు. కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న 150 మందిని తాలిబన్లు అడ్డగించి, అపహరించారని తొలుత ‘కాబూల్‌ నౌ’ న్యూస్‌ పోర్టల్‌ వెల్లడించింది. కిడ్నాప్‌నకు గురైన వారిలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది. కొన్ని గంటల తర్వాత బందీలంతా విడుదలయ్యారని, ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్తున్నారని ప్రకటించింది.  చదవండి : అమెరికా నావికాదళ అధికారుల మానవత్వం.. ఆ పాప మళ్లీ నవ్వింది..! 

మరిన్ని వార్తలు