‘బ్రిటన్‌’ జర్నీపై ప్రత్యేక నిఘా

22 Dec, 2020 08:12 IST|Sakshi

కనెక్టింగ్‌ ఫ్లైట్ల ద్వారా ఇక్కడకు వచ్చే వారిపై దృష్టి

అక్కడ కరోనా తీవ్రతతో యంత్రాంగం అప్రమత్తం

ప్రతి ఒక్కరికీ కరోనా ఆర్‌టీపీసీఆర్‌ నిర్ధారణ పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌: బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్నంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపాలని నిర్ణయించింది. ఇటు బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యం లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే కనెక్టింగ్‌ ఫ్లైట్ల ద్వారా బ్రిటన్‌ నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన కరోనా నెగెటివ్‌ రిపోర్టు చూపించినా, ఇక్కడ దిగిన తర్వాత తప్పనిసరిగా పరీక్ష చేయనున్నారు. ఈ నిర్ణయం సోమవారం నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా బ్రిటన్‌ నుంచి ప్రతిరోజూ రెండు విమానాలు వస్తాయని అధికారులు తెలిపారు. ఒకటి నేరుగా, మరొకటి కనెక్టింగ్‌ ఫ్లైట్‌ వస్తుంది. అందులో సరాసరి 400 మంది ప్రయాణికులు వస్తుంటారు.  సోమవారం నుంచి బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయా ణికులు తిరిగి టికెట్ల రద్దు కోసం బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్, తదితర సంస్థలను ఆశ్రయిస్తున్నారు. 

లక్షణాలుండి పాజిటివ్‌ అయితే టిమ్స్‌కు.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశముంది. టెస్టుల్లో కరోనా లక్షణాలు ఉండి పాజిటివ్‌ వచ్చిన వారిని టిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తారు. నెగెటివ్‌ వచ్చినవారిని హోటల్‌ లేదా సర్కారు క్వారంటైన్‌కు తరలిస్తారు.  ఆర్‌టీపీసీఆర్‌ శాంపిళ్లు తీసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు ప్రయాణీకులు ఎక్కడుండాలో స్పష్టత లేదు.  (చదవండి: కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు)

తెలుగు వారిలో ఆందోళన.. 
లండన్‌ నుంచి హైదరాబాద్‌కు కూడా రాకపోకలు స్తంభించడంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్న తెలుగు వారు ఆందోళన చెందుతున్నారు. 

>
మరిన్ని వార్తలు