కొనడానికి లేదు.. తినడానికి లేదు

10 Jul, 2022 05:44 IST|Sakshi

ఏమీ కొనేటట్టు లేదు. ఏమీ తినేటట్టు లేదు. కొనడానికి డబ్బుల్లేవు. డబ్బులున్నా కొనడానికి ఏమీ దొరకవు. పెట్రోల్‌ బంకుల దగ్గర రోజుల తరబడి క్యూ లైన్లు ఆఫీసుల్లేవు, పనుల్లేవు. చదువుల్లేవు. కాస్త గాలి ఆడేలా ఫ్యాన్‌ కింద కునుకు తీద్దామంటే కరెంట్‌ ఉండదు.   ఏం చేయాలి? ఎలా బతకాలి?  అందుకే కడుపు మండిన సగటు శ్రీలంక పౌరులు రోడ్డెక్కారు.   అవినీతి అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ సమరభేరి మోగించారు.

కడుపు నింపుకోవడానికి కావల్సినంత తిండి దొరకదు. అర్థాకలితో కంచం ముందు నుంచి లేవాలి. కాసేపు ఫ్యాన్‌ కింద కూర్చుద్దామంటే కరెంట్‌ ఉండదు. రోజుకి 13 గంటల విద్యుత్‌ కోతలు. బయటకు వెళ్లాలంటే పెట్రోల్‌ లేక వాహనం కదలదు. పాఠశాలలు, కార్యాలయాలు మూతబడ్డాయి. అటు ధరాభారం, ఇటు నిత్యావసరాల కొరతతో శ్రీలంక పౌరుల బతుకు భారంగా మారింది.

ఏది కొనాలన్నా క్యూ లైన్లలో నిల్చోవాలి. కాళ్లు పడిపోయేలా నిల్చున్నా కావల్సినవి దొరుకుతాయన్న నమ్మకం లేదు. లీటర్‌ పెట్రోల్‌ రూ.450, కేజీ బియ్యం రూ.250, కేజీ కందిపప్పు రూ. 420, ఒక కొబ్బరికాయ రూ.110, కేజీ కేరట్‌ రూ.250, అయిదు కేజీల గ్యాస్‌ బండ ధర రూ.1150... ఇవీ శ్రీలంకలో ధరలు ... నిత్యావసరాల ధరలు ఆ స్థాయిలో ఉంటే ఎలా కొంటారు ? ఏం తింటారు ? ఇక పిల్లలకైతే పౌష్టికాహారం దొరకడం లేదు.

పాల పౌడర్‌ దిగుమతులు గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బతుకు దుర్భరమైన పరిస్థితుల్లో ఒంటికేదైనా వచ్చినా ఆస్పత్రుల్లో అత్యవసర మందులకి కూడా కొరత నెలకొంది. వైద్యం కూడా అందరికీ అందని పరిస్థితి వచ్చేసింది. పెట్రోల్‌ ధరలు మండిపోతూ ఉండడంతో చాలా మంది తమ కండబలాన్ని నమ్ముకున్నారు. స్కూటర్లు, కార్లు అమ్మేసి సైకిళ్లు కొనుక్కుంటున్నారు. బంగారాన్ని, ఆభరణాల్ని కూడా అమ్మేస్తున్నారు.

2021లో 7 టన్నుల బంగారాన్ని అమ్మిన శ్రీలంక ప్రజలు ఈ ఏడాది 20శాతం అధికంగా అమ్మేయవచ్చునని అంచనాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో ప్రజాగ్రహం అధ్యక్ష పీఠాన్ని వదలని గొటబాయ రాజపక్స మీదకు మళ్లింది.దేశంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష, ప్రధాని భవనాలను ముట్టడించారు. మొత్తంగా శ్రీలంక ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి ?  
పర్యాటక రంగం మీద ప్రధానంగా ఆధారపడిన శ్రీలం కోవిడ్‌–19 విసిరిన పంజా కోలుకోలేని దెబ్బ తీసింది. 2019లో 19 లక్షల మంది లంకను సందర్శిస్తే, 2020లో వారి సంఖ్య ఏకంగా 5 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రధానంగా పర్యాటకం మీద ఆధారపడ్డ ఆ దేశానికి దెబ్బ తగిలింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి భారీగా ఆదాయం వచ్చే దేశంలో రైతులు అందరూ సేంద్రీయ ఎరువులు వాడి తీరాలన్న ప్రభుత్వ నిబంధనతో వ్యవసాయ దిగుబడులు భారీగా తగ్గిపోయాయి.. మరీ ముఖ్యంగా ధాన్యం, రబ్బర్, టీ, కొబ్బరి వంటి పంటల దిగుబడి దారుణంగా పడిపోయింది. దీనికి తోడు రాజపక్స కుటుంబం ఏళ్ల తరబడి చేస్తున్న అవినీతి, ప్రభుత్వ అరాచక విధానాలు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి.

ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విదేశీ అప్పుల్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో డాలర్‌ మారకం విలువ రూ.200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.360కు చేరుకుంది. విదేశీ నిల్వలు తరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రపంచ దేశాల సహకారంతో పాటు పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి తేవాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. సాగులో ఉత్పాదకత పెంచడం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాల కల్పన, సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయడం, కార్మికులు రెట్టింపు శ్రమ చేయడం, ప్రజా సేవలు, విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను రూపొందించడం వంటివి చేయాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు