గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు

6 Feb, 2023 04:19 IST|Sakshi

కాక రేపుతున్న నిఘా బెలూన్లు

శతాబ్దాలుగా కొనసాగుతున్న వాడకం

ఓ బెలూన్‌ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్‌ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది...

ఈ కాలంలోనూ అవసరముందా?
సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది.

చైనా ప్రయోగం వెనక...
అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్‌ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది.

ప్రతిగా తైవాన్‌ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్‌ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు.

ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి?
► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్‌ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్‌ వీటిని తొలిసారి వాడింది.
► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది.
► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్‌ సైన్యం ప్రయోగించిన బెలూన్‌ బాంబు అమెరికాలో ఒరెగాన్‌ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు.
► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్‌ జెనెట్రిక్స్‌ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్‌ భూభాగాన్ని ఫొటోలు తీసింది.
► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్‌ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్‌ యూనియన్‌ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది.

ఏమిటీ నిఘా బెలూన్లు?
నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి.

స్పై బెలూన్లు... కథా కమామిషు
ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు
అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు
సౌర పలకలు
నిఘా పరికరాలు
గాలివాటంగా కదులుతాయి
కిందివైపు కెమెరా ఉంటుంది
రాడార్‌ వ్యవస్థలను అనుసంధానించవచ్చు
24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు