జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి.. భయంకర దృశ్యాలు వైరల్‌

22 Sep, 2022 19:02 IST|Sakshi

జంతువులతో జోక్స్‌ చేయడం మంచిది కాదు. చిన్నవైనా, పెద్దవైనా వాటితో సాహసాలు చేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటుంది. జంతువులని ఎంత మచ్చిక చేసుకున్నప్పటికీ ప్రతిసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అనేక సార్లు అవి మనుషులకు హాని కలిగించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి భయంకర ఘటన  దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. 

వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌లోని ఉద్యోగిపై ఓ భారీ మొసలి అనూహ్యంగా దాడి చేసింది. దీనిని వైల్డ్ హార్ట్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని క్రొకోడైల్ క్రీక్ ఫామ్‌లో సెప్టెంబర్ 10న ఈ భయానక సంఘటన జరిగింది. జూకీపర్ సీన్ లే క్లస్ రెండు మొసళ్లతో  లైవ్ షో నిర్వహిస్తున్నారు. ఇందులో  హన్నిబల్‌ అనే 16 అడుగుల పొడవైన, 660 కేజీల బరువుండే పెద్ద మొసలి ఉంది. దాని పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. క్లస్ గత 30 సంవత్సరాలుగా  ఈ భారీ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు.
చదవండి: ఇలా కూడా ఉద్యోగాన్ని రిజెక్ట్‌ చేస్తారా!.. చైనా కంపెనీపై మండుతున్న నెటిజన్లు

షోలో భాగంగా జూ కీపర్‌ ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ మొసలి వీపుపై కూర్చున్నాడు. వెంటనే దాని నుంచి దిగి పక్కకు వెళ్తున్న అతనిపై ఆ మొసలి ఒక్కసారిగా ఎదురు తిరిగింది. తన పదునైన పళ్లతో ఆయన తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. జూ కీపర్‌ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. కాగా క్రూర జంతువులతో ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు