స్పిన్‌లాంచ్‌ మొదటి ప్రయోగం.. తిప్పితిప్పి వదిలితే... కక్ష్యలోకి!

12 Nov, 2021 12:10 IST|Sakshi

మీకు వడిసెల అంటే ఏమిటో తెలుసా? చేలల్లో పక్షులను బెదరగొట్టేందుకు వాడుతూంటారు. వడిసెలలో రాయి పెట్టి గిర్రున తిప్పి వదిలిన రాయి తగిలితే పక్షులు గిలగిల్లాడిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఉపగ్రహాలనూ వడిశలోని రాయి మాదిరిగా గిర్రున తిప్పి వదిలితే భూమి కక్ష్యలోకి రిపోతాయంటోంది స్పిన్‌లాంచ్‌! 

ఫొటోలో కనిపిస్తున్న యంత్రం ద్వారా కొన్ని ప్రయోగాలూ విజయవంతం చేసేసింది. ఆశ్చర్యంగా అనిపించినా ఈ పద్ధతి మనం ప్రస్తుతం ఉపగ్రహాల ప్రయోగం కోసం ఉపయోగిస్తున్న రాకెట్ల కంటే ఎంతో చౌక మాత్రమే కాదు.. పర్యావరణ అనుకూలం కూడా. విద్యుత్‌ సాయంతో నడిచే ఈ యంత్రంలో ఉపగ్రహం గంటకు 8 వేల కి.మీ. వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పైనున్న గొట్టం ద్వారా ఆకాశంలోకి దూసుకుపోతుందని కంపెనీ చెబుతోంది. యంత్రం లోపలి భాగంలోని శూన్యం కారణంగా ఇంత వేగంగా తిరగడం సులువుగానే జరుగుతుందట. 

సబ్‌ఆర్బిటల్‌ యాక్సిలరేటర్‌ అని పిలిచే ఈ యంత్రం సైజు 177 అడుగుల కంటే ఎక్కువే. వేగంగా తిరిగినప్పటికీ ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఇబ్బందేమీ ఉండదని కంపెనీ ఘంటాపథంగా చెబుతోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సూక్ష్మమైన కెపాసిటర్లు, మైక్రోప్రాసెసర్లు, రెసిస్టర్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి గురుత్వాకర్షణ శక్తికి 10 వేల రెట్ల ఎక్కువ శక్తిని కూడా తట్టుకోగలవని అంటోంది. గత నెల 22న తాము ఒక నమూనా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించామని, మరిన్ని పరీక్షలు నిర్వహించి 2024 కల్లా దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామంటోంది. కనీసం 200 కిలోల బరువున్న ఉపగ్రహాలను కూడా ప్రయోగించేలా మరింత భారీ సైజు సబ్‌ ఆర్బిటల్‌ యాక్సిలరేటర్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు వివరించింది.

మరిన్ని వార్తలు