మా వల్ల కాదు.. కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు, ప్రధాని రాజీనామాకు పట్టు

8 Apr, 2022 10:32 IST|Sakshi

కొలంబో:  శ్రీలంక రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లంక ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాని గద్దెదిగిపోవాలంటూ ప్రధాని కార్యాలయం ఎదుట నిరసనల నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

చేతగానీ పాలనతో దేశాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిన ప్రధాని మహీందా రాజపక్సే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, తన సోదరుడు అధ్యక్షుడైన గోటబయ రాజపక్సతో సహా పదవుల నుంచి దిగిపోవాలంటూ ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ప్రధాని నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని భరించడం తమ వల్ల కాదంటూ నినాదాలు చేశారు. అవినీతి ద్వారా కూడబెట్టిన డబ్బును తక్షణమే బయటకు తేవాలని, సంక్షోభం నుంచి లంకను బయటపడేయాలంటూ రాజపక్స కుటుంబాన్ని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

నిరసనకారులను అడ్డగించిన భద్రతా సిబ్బంది.. ప్రధాని నివాసం చుట్టూ భారీ వలయంగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా.. దేశం కోసం నినాదంతో మహీంద రాజపక్స తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు లంక పాలిట శాపంగా పరిణమించాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రధాన ఆదాయంవచ్చే టూరిజం ఘోరంగా దెబ్బతినగా.. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి పెరిగిన ధరలు, నిత్యావసరాలు, మందుల కొరతతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.

చదవండి: చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు.. కష్టాల నుంచి లంక గట్టేక్కేనా?

మరిన్ని వార్తలు