Sri Lanka: అప్పుల కుప్ప శ్రీలంక.. అంతా రాజపక్సల మాయ!

24 Apr, 2022 05:07 IST|Sakshi

 2 దశాబ్దాలుగా రాజపక్సల రాజ్యమే

వారి అవినీతితో విసిగిపోయిన జనం

తప్పుడు నిర్ణయాలతో దేశం అస్తవ్యస్తం

గద్దె దిగాలంటూ నిరసనల వెల్లువ

శ్రీలంకలో సంక్షోభం మొదలై నెల దాటుతోంది. ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోందే తప్ప చల్లారడం లేదు. రాజపక్స కుటుంబమంతా రాజీనామా చేయాలని నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ ఒక్క డిమాండ్‌తోనే నిరసనకారులు రోజుల తరబడి అధ్యక్ష భవనం ఎదుట బైఠాయిస్తున్నారు. అరెస్టులకు, లాఠీ దెబ్బలకు వెరవకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా రాజపక్స వంశాన్ని ఆరాధించిన జనం ఇప్పడు ఆ పేరు చెబితేనే ఎందుకు మండిపడుతున్నారు?

అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అని దశాబ్దాల కిందట మహాకవి శ్రీశ్రీ రాసిన మాటలు ఇప్పటికీ అక్షర సత్యమని శ్రీలంక రాజకీయాలు నిరూపిస్తున్నాయి. రాజపక్స కుటుంబీకుల బంధుప్రీతి, అవినీతి దేశాన్ని ఆర్థికంగా దిగజార్చడమే గాక ప్రజల్లో ఆ కుటుంబంపై ఏహ్యభావం ఏర్పడింది. రాజపక్సలు దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారాన్ని గుప్పిట పట్టి ఉంటూ చక్రం తిప్పుతున్నారు.

వారి పార్టీ శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) 1948 ఫిబ్రవరిలో శ్రీలంకకు స్వాతంత్య్రం రావడానికి ముందే పుట్టింది. దాని వ్యవస్థాపకుడు డాన్‌ అల్విన్‌ రాజపక్స పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి రాజకీయాల్లో ఆ కుటుంబ ప్రస్థానం మొదలైంది. అల్విన్‌ కుమారులైన ప్రధాని మహింద, అధ్యక్షుడు గొటబయ, చమిల్, బాసిల్‌ సోదరులు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.

శ్రీలంక ప్రస్తుత దుస్థితికి ఈ నలుగురు అన్నదమ్ములే కారణమన్న విమర్శలున్నాయి. భావి తరం నేతలుగా చక్రం తిప్పడానికి వారి కుమారులు నమల్, యోషిత, శశీంద్ర కూడా సిద్ధంగా ఉన్నారు. మహింద రెండోసారి అధ్యక్షుడిగా చేసిన 2010–15 మధ్య ఆ కుటుంబం నుంచి ఏకంగా 40 మందికి పైగా ప్రభుత్వ పదవుల్లో కొనసాగారు! వారిలో అత్యధికులు ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేశ అప్పుల్లో 78% రాజపక్సల హయాంలో చేసినవే!  

బాసిల్‌ రాజపక్స (70)
మాజీ ఆర్థిక మంత్రి
అన్నదమ్ముల్లో చిన్నవాడు. ఆర్థికమంత్రిగా అవకతవక నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారు. కాంట్రాక్ట్‌ ఏదైనా 10 శాతం కమీషన్‌ ముట్టజెప్పాల్సిందే. అందుకే బాసిల్‌ను మిస్టర్‌ 10% అని పిలుస్తారు.

మహింద రాజపక్స (76)     
ప్రధాని
అత్యంత ప్రజాదరణ ఉన్న నేత. 2005 నుంచి పదేళ్లు దేశాధ్యక్షుడు. ప్రత్యేక తమిళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. దశాబ్దాల తరబడి సాగిన అంతర్యుద్ధాన్ని మే 2009లో మిలటరీ ఆపరేషన్‌తో నామరూపాల్లేకుండా చేసి సింహళ–బుద్ధిస్టులకు ఆరాధ్యునిగా మారారు. మహింద హయాంలోనే శ్రీలంక చైనాకు దగ్గరైంది. మౌలిక సదుపాయాల కల్పనకంటూ 700 కోట్ల డాలర్లు అప్పుగా తెచ్చారు. ఆ ప్రాజెక్టుల్లో భారీ అవినీతితో ఆ రుణ భారం కొండంతైంది. ఆయన ఏకంగా 1,900 కోట్ల డాలర్లు పోగేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

గొటబయ రాజపక్స (72)     
అధ్యక్షుడు
అన్న మహిందకు కుడిభుజం. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్నారు. 2005లో రక్షణ శాఖకు శాశ్వత కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతర్యుద్ధ సమయంలో తమిళ రెబెల్స్‌పై మూకుమ్మడి అత్యాచారాలు, హింస, హత్యల వెనుక గొటబయ హస్తముందంటారు. ఫైర్‌ బ్రాండ్‌ ముద్ర ఉన్న ఈయనను కుటుంబీకులే టెర్మినేటర్‌ అని పిలుస్తూంటారు. 2019లో అధ్యక్షుడయ్యాక రక్షణ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. 2020 అక్టోబర్‌లో అధ్యక్షుడికి అపరిమిత కార్యనిర్వాహక అధికారాలు కల్పించుకోవడం వివాదాస్పదమైంది.

చమల్‌ రాజపక్స (79)
నీటిపారుదల మంత్రి
మహింద అధ్యక్షుడిగా ఉండగా స్పీకర్‌గా చేశారు. ప్రపంచంలో తొలి మహిళా ప్రధాని సిరిమావో బండారు నాయకేకు వ్యక్తిగత అంగరక్షకుడిగా చేయడంతో బాడీగార్డ్‌ అనే పేరు స్థిరపడిపోయింది. ప్రస్తుతం నీటిపారుదల మంత్రి. అన్నదమ్ముల్లో అంతగా వివాదాలు లేనిది ఈయనొక్కడే.

నమల్‌ రాజపక్స (35)
క్రీడలు, యువజన మంత్రి  
మహింద కుమారుడు. 2010లో 24 ఏళ్ల వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎప్పటికైనా అధ్యక్షుడు కావాలని కలలు గంటున్నారు. మహింద అధ్యక్షుడిగా ఉండగా ఏ పదవీ లేకుండానే చక్రం తిప్పడంతో పాటు ఈయనపై మరెన్నో అవినీతి ఆరోపణలూ ఉన్నాయి.
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు