ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

13 Jul, 2022 12:05 IST|Sakshi

కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కట్టలు తెంచుకున్న జనాగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచిపారిపోయారు. ఇది తెలిసిన జనం ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొదట ఆందోళనకారులను పోలీసులు గానీ, సైన్యం గానీ నిలువరించలేదు. కానీ వారీ వారు ప్రధాని నివాసం గేటు వద్దకు చేరుకున్నాక పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే శ్రీలంక ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు.

అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు.

ప్రజల ఆందోళన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స.. అదే రోజు దేశం విడిచి పారిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని విక్రమ సింఘే ఇదివరకే ప్రకటించారు. కానీ పరిస్థితులు దిగజారినందున లంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్‌ రియాక్షన్‌ ఏంటంటే?

మరిన్ని వార్తలు