కళ్లుగప్పి పారిపోవాలనుకున్న శ్రీలంక మాజీ మంత్రి.. ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తుపట్టడంతో..

12 Jul, 2022 14:04 IST|Sakshi

కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు చూసి నాయకులు వణికిపోతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సహా ఇప్పటికే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా శ్రీలంక మాజీ మంత్రి, గొటబాయ సోదరుడు బసిల్ రాజపక్స దుబాయ్‌ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 

దుబాయ్‌ వెళ్లేందుకు మంగళవారం ఉదయం 12:15గంటలకే కొలంబో విమానాశ్రయం చేరుకున్నారు బసిల్ రాజపక్స. చెక్ ఇన్ కౌంటర్లో ఉన్న ఆయనను అక్కడున్న వారు సహా ఇమ్మిగ్రేషన్ సిబ్బంది గుర్తుపట్టారు. దీంతో అతడ్ని దేశం దాటి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇక చేసేదేం లేక 3:15గం.  వరకు వేచి చూసి విమానాశ్రయం నుంచి బసిల్ తిరిగివెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

శ్రీలంక పరిస్థితులు చూసి ఉన్నతాధికారులు, నాయకులను దేశం వీడి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు సిబ్బంది అనుమతించట్లేదని సంబంధింత వర్గాలు తెలిపాయి. తమకు సరైన భద్రత కల్పించేవరకు వీఐపీ సేవలు కొనసాగించమని పేర్కొన్నట్లు చెప్పాయి.

మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ బుధవారం అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో శ్రీలంక అఖిల పక్షాలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

చదవండి: లంకకు 20న కొత్త అధ్యక్షుడు

మరిన్ని వార్తలు