పెట్రోల్‌ కోసం క్యూలో గంటల తరబడి కాదు.. రోజుల తరబడి..

2 Jul, 2022 12:59 IST|Sakshi

శ్రీ లంక సంక్షోభం ఇప్పుడు ఏమేరకు చేరిందో తెలుసా?.. పెట్రోల్‌ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు.. రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి.

అవును.. శ్రీలంకలో పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుకుంది. పెట్రో అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తోంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.  గత పది పదిహేను రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

పెట్రోల్‌, డీజిల​కోసం లైన్లలో ఎదురు చూపులు తప్పడం లేదు. కొందరైతే క్యూలోనే రోజుల తరబడి ఉండిపోతున్నారు. అక్కడే బస చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాహనాలకు సైతం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, వాహనాలనే నమ్ముకుని బతుకుతున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 

తీవ్ర సంక్షోభం.. అప్పుల నడుమ శ్రీలంకకు చమురు ఇంధనాలు చేరుకోవడం లేదు. ఇంధన కొరతతో నో స్టాక్‌ బోర్డులు కనిపిస్తున్నాయి చాలా చోట్ల. దీంతో పెట్రో బంకుల వద్ద భారీ క్యూలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితి అదుపు చేయడానికి సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాదారులను అదుపు చేయడంతో పాటు టోకెన్లను సైతం వాళ్లే దగ్గరుండి పంచుతున్నారు. 

గాలే టెస్టును కవరేజ్‌ చేయడానికి ఓ జర్నలిస్ట్‌.. సుమారు ఐదు కిలోమీటర్లు సైకిల్‌ మీద ప్రయాణించాడంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో రిపోర్టర్‌ ఆండ్రూ ఫైడెల్‌ ఫెర్నాండోకు ఈ అనుభవం ఎదురైంది.

>
మరిన్ని వార్తలు