శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్‌ పంపిణీ!

16 Jul, 2022 16:24 IST|Sakshi

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది.  పెట్రోల్‌, డీజిల్‌ కోసం పెట్రోల్‌ పంపుల ముందు రోజుల తరబడి నిలుచోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 'నేషనల్‌ ఇంధన పాస్‌' పేరుతో ఇంధన రేషన్‌ పథకాన్ని శనివారం ప్రవేశపెట్టారు ఆ దేశ విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేకర. ఈ కొత్త పాస్‌ ద్వారా వారం పద్ధతిలో ఇంధన కోటాను కేటాయిస్తారు. వాహన నంబర్‌, ఇతర వివరాలను ధ్రువీకరించి నేషనల్‌ ఐడెండిటీ కార్డు(ఎన్‌ఐసీ) అందిస్తారు. దానికి క్యూఆర్‌ కోడ్‌లు కేటాయిస్తారు.

రిజిస్ట్రేషన్‌ వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌లోని చివరి అంకె ద్వారా తమ వంతు ఎప్పుడు వస్తుందని తెలుసుకోవచ్చు. మరోవైపు.. దేశంలోని పర్యాటకులు, విదేశీయులు కొలంబోలో పెట్రోల్‌, డీజిల్‌ పొందేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు మంత్రి. ' శనివారం మధ్యాహ్నం నుంచి నేషనల్‌ ఇంధన పాస్‌ల పంపిణీ ప్రారంభిస‍్తున్నాం. పాస్‌ల ద్వారా వారం పద్ధతిలో గ్యారంటీపెట్రోల్‌, డీజిల్‌ల కోటాను కేటాయిస్తాం. ఒక వాహనానికి ఒక ఎన్‌ఐసీ, క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నంబర్‌ ప్లేట్‌ లోని చివరి అంకె సహాయంతో వారంలో రెండు రోజుల్లో ఇంధనం పొందొచ్చు.' అని విజేశేకర ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

దేశంలోని ఇంధన కొరతను తీర్చేందుకు పొరుగు దేశాలతో పాటు రష్యాతోనూ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ముడి చమురు సరఫరాకు మార్గం సుగమమైతే కొంత మేర ఇంధన కొరతకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంధనంతో పాటు ఆహార, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

ఇదీ చూడండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ

మరిన్ని వార్తలు