Sri Lanka New PM: మోదీకి ధన్యవాదాలు: శ్రీలంక కొత్త ప్రధాని

13 May, 2022 11:31 IST|Sakshi

కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్‌పీ పార్టీ నేత రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, తీవ్రతరమవుతున్న ఆందోళనకారుల నిరసనలకు ముగింపు పలికేందుకు శ్రీలంక 26వ ప్రధానిగా 73 ఏళ్ల రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స గురువారం రణిల్‌ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. కాగా రణిల్‌ గతంలో అయిదు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా వ్యవహరించారు.

శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్‌ స్వాగతించింది. శ్రీలంకకు ఇండియా సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్‌ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం రాత్రి జరిగిన ఓ వేడుకలో రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని, అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్‌ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు వివిధ రూపంలో  భారతదేశం 3 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందించింది.

కాగా ఆ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ విషమిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని పదవికి మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా 1948లో బ్రిటన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడం ఇదే తొలిసారి. ధరలు అధికంగా పెరగడంతో ప్రజలు నిత్యావసరాలైన ఆహారం, మందులు, ఇంధనం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 
చదవండి: నాటో దిశగా ఫిన్‌లాండ్‌ అడుగులు

మరిన్ని వార్తలు