Dinesh Gunawardena: శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్‌ గుణవర్ధన

22 Jul, 2022 13:16 IST|Sakshi

కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ సింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రణిల్‌ ప్రదానిగా రాజీనామా చేయడంతో ఆ పదవీ ఇప్పుడూ ఖాళీగా ఉంది. రణిల్‌ సన్నిహితుడు రాజపక్సల కుటుంబాలతో అ‍త్యంత సాన్నిత్యం ఉన్న వ్యక్తి అయిన దినేష్‌ గుణవర్ధన ప్రధానిగా నియమితులయ్యారు. ఈ మేరకు గుణవర్ధన శుక్రవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. తదనంతరం మిగిలిన మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ హాయంలో గుణవర్ధన హోం మంత్రిగా పనిచేశారు.

అపార రాజీకీయ అనుభవం ఉన్న గుణవర్థన గతంలో విదేశాంగ మంత్రిగానూ, విద్యామంత్రిగానూ పని చేశారు. జాతీయ ప్రభుత్వం ఆమోదం పొందే వరకు మునపటి మంత్రివర్గం పనిచేస్తుందని నూతన అధ్యక్షుడు రణిల్‌ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు కాగానే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆందోళనకారులు నిరసనలు ఆగడం లేదు. విక్రమసింఘే రాజపక్సల విధేయుడు కావడంతో పరిపాలనలో పెద్దగా మార్పు సంతరించుకోదన్న భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.

దీంతో ఆందోళనకారులు కొలంబో వీధుల్లో రణిల్‌ రాజీనామా చేయాలంటే ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు రణిల్‌ శాంతియుత నిరసనలకు మద్దతు ఇస్తాను గానీ శాంతియుత నిరసన ముసుగులో హింసాత్మక దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అందులో భాగంగానే అధ్యక్ష భవనం సమీపంలోని నిరసనకారుల శిభిరాల పై లంక సైనికులు, పోలీసులు దాడులు చేశారు.

ఈ మేరకు అధ్యక్ష భవనం ప్రధాన గేటును బ్లాక్‌ చేస్తూ నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడమే కాకుండా ఆందోళనకారులు ఆ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలంటూ హచ్చరికలు జారీ చేశారు. అంతేగాదు తొమ్మిది మంది ఆందోళనకారులను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రీక్త వాతవరణం చోటు చేసుకుంది. 

(చదవండి: గోటబయకు ఊరట... గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సింగపూర్‌!)

మరిన్ని వార్తలు