లంకకు 20న కొత్త అధ్యక్షుడు

12 Jul, 2022 06:05 IST|Sakshi
అధ్యక్ష కార్యాలయం నిండా నిరసనకారులు; దర్జాగా భోజనం చేస్తున్న నిరసనకారుడు

త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం

ఆ వెంటనే తప్పుకోనున్న కేబినెట్‌

సైన్యాన్ని పంపడం లేదు: భారత్‌

కొలంబో/ఐరాస: కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్‌ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

తాను కూడా బుధవారం రాజీనామా చేస్తానని గొటబయ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం సోమవారం కూడా మల్లగుల్లాలు పడింది. దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రకటించింది. జూలై 20న కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుందని స్పీకర్‌ ప్రకటించారు.

శ్రీలంక పరిణామాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వెలిబుచ్చారు. పరిస్థితిని అదుపు చేసేందుకు లంకకు భారత్‌ సైన్యాన్ని పంపనుందన్న వార్తలను కేంద్రం ఖండించింది. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన నిరసనకారులు అందులోని విలాసవంతమైన బెడ్రూముల్లో సేదదీరుతూ కన్పించారు. పలువురు తమకు దొరికిన నోట్ల కట్టలను ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు