Sri Lanka Crisis: శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడిగింపు.. మరో 14 రోజులు సింగపూర్‌లోనే గొటబయ!

28 Jul, 2022 09:33 IST|Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సాదారణ స్థితికి వచ్చేలా కనిపించటం లేదు. ఇటీవలే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్‌ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన పదవి చేపట్టిన క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. నిరసనకారుల టెంట్లను తొలగించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపారు. తాజాగా.. దేశంలో ఎమర్జెన్సీని మరో నెల రోజుల పాటు పొడిగించింది విక్రమ సింఘే ప్రభుత్వం. అత్యవసర పరిస్థితి పొడిగించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది ఆ దేశ పార్లమెంట్‌. దీనిపై ఓటింగ్‌ చేపట్టగా 120 మంది అనుకూలంగా ఓటు వేశారు. 63 మంది చట్టసభ్యులు వ‍్యతిరేకించారు. 

ప్రజాభద్రత, నిరాటంకంగా నిత్యావసరాల సరఫరా వంటి అంశాలను చూపుతూ జులై 18న దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు రణీల్‌ విక్రమ సింఘే. ఆ ఆర్డినెన్స్‌కు 14 రోజుల్లోగా పార్లమెంట్‌ ఆమోదం తెలపకపోతే అది రద్దవుతుంది. కానీ, తాజాగా పార్లెమెంట్‌ ఆమోద ముద్ర వేసింది. దీంతో మరో నెల రోజుల పాటు దేశంలో అత్యవసర స్థితి అమలులో ఉండనుంది. 

సింగపూర్‌లో మరో 14 రోజులు గొటబయ.. 
ప్రజాగ్రహంతో దేశం విడిచి సింగపూర్‌ పారిపోయారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. జులై 14న మాల్దీవుల నుంచి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయనకు 14 రోజుల పర్యటక పాస్‌ను ఇచ్చింది ఆ దేశం. అయితే.. సమయం ముగియనుండటంతో మరో 14 రోజులు పొడిగించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆగస్టు 11 వరకు గొటబయ సింగపూర్‌లో ఉండనున్నారని తెలిపింది.  మరోవైపు.. సింగపూర్‌ నుంచి గొటబయ తిరిగి వస్తారని రెండు రోజుల క్రితం శ్రీలంక కేబినెట్‌ ప్రతినిధి బందులా గునవర్ధనే పేర్కొనటం గమనార్హం. సింగపూర్‌ వెళ్లిన తర్వాత ఓ హోటల్‌లో బస చేసిన గొటబయ.. ప్రస్తుతం ప్రైవేట్‌ ఇంటికి మారినట్లు సమాచారం.

ఇదీ చదవండి: Volodymyr Zelensky: భార్య ఒలేనాతో జెలెన్‌స్కీ పోజులు.. నెటిజన‍్ల విమర్శలు

మరిన్ని వార్తలు