లంక దహనం

10 May, 2022 06:30 IST|Sakshi

రణరంగంగా మారిన శ్రీలంక 

నిరసనకారులపై మహింద అనుచరుల దాడి 

దాంతో జనం కన్నెర్ర, దేశవ్యాప్తంగా అల్లర్లు

లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై సోమవారం ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు.

మహింద ఇంటితో పాటు రాజపక్సల పూర్వీకుల ఇంటిని కూడా తగలబెట్టారు. మంత్రులు, మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులకు దిగారు. వాటికి నిప్పు పెట్టారు. నిరసనకారులు చుట్టుముట్టడంతో అధికార పార్టీ ఎంపీ ఒకరు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స (76) పదవి నుంచి తప్పుకున్నారు. దేశమంతటా కర్ఫ్యూ విధించారు. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది.

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది. దేశ ఆర్థిక పతనానికి ప్రభుత్వమే కారణమంటూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు నిరసన చేస్తున్న వారిపై ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడికి దిగారు. నిరసనకారుల టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ క్యానన్లు ప్రయోగించినా లాభం లేకపోయింది. ఈ ఘర్షణల్లో 170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారు. దాంతో జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు.

కొలంబో నుంచి తిరిగి వెళ్తున్న రాజపక్సల మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దొరికిని వారిని దొరికినట్టు చితకబాదారు. అంతేగాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులపై, రాజపక్స మద్దతుదారులపై నిరసనకారులు దాడులకు దిగారు. కురునెగలలోని ప్రధాని మహింద నివాసంతో పాటు హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల నివాసానికి కూడా నిప్పు పెట్టారు. హంబన్‌టోటలో మహింద, గొటబయల డీఏ రాజపక్స జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాన్ని కూడా ధ్వంసం చేశారు.

వాయవ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార శ్రీలంక పొడుజన పెరమున (ఎల్‌ఎల్‌పీపీ) ఎంపీ అమరకీర్తి (57) కారును అడ్డగించారు. ఆయన తన రివాల్వర్‌తో కాల్పులకు దిగడంతో ఒక నిరసనకారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరనసకారులు వెంబడించడంతో ఎంపీ దగ్గర్లోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుముట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. భయాందోళనలకు లోనైన ఎంపీ తుపాకీతో కాల్చుకుని చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆయన భద్రతాధికారి కూడా మరణించాడు.

కురునెగలలోని మాజీ మంత్రి జాన్‌స్టన్‌ ఫెర్నాండోపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆయన నివాసాలకు, హోటల్‌కు నిప్పుపెట్టారు. నెగొంబోలోని మరో మాజీ మంత్రి నిమల్‌ లాంజా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మొరటువా మేయర్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో ఇంటికి కూడా నిప్పుపెట్టారు. కొలంబోలోనూ ఘర్షణలు తారస్థాయికి చేరాయి. అధ్యక్ష భ వనం ముందు నిరసనకారులపై దాడికి నేతృ త్వం వహించిన అధికార పార్టీ కార్మిక విభాగం నేత మహింద కహందగమగె ఇంటిపై దాడి జరిగింది. ఘర్షణలు దేశవ్యాప్తంగా పలు పలుచోట్ల కాల్పులకు దారితీశాయి. వాటిలో కనీసం ఇద్దరు మరణించగా 9 మంది గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు.

కొలంబోలో రంగంలోకి సైన్యం
ఘర్షణలు చెలరేగిన కొద్ది గంటలకే ప్రధాని మహింద అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో మంత్రివర్గమూ రద్దయింది. అల్లర్లపై గొటబయ, మహింద విచారం వెలిబుచ్చారు. ‘‘హింసకు హింస పరిష్కారం కాదు. ప్రజలు సంయమనం పాటించాలి’’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే మహిందే తనవారిని ఆందోళనకారులపై దాడులకు దిగేలా రెచ్చగొట్టారని విపక్షాలు దుయ్యబట్టాయి. మాజీ అధ్యక్షుడు ప్రేమదాసపైనా వారు దాడులకు దిగారని ఆరోపించాయి.

పరిస్థితిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పోలీసులకు సెలవులను రద్దు చేశారు. రాజపక్స సోదరుల అస్తవ్యస్త విధానాలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తెలిసిందే. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటడమే గాక నిత్యావసరాల ధరలు చుక్కలను కూడా దాటేశాయి. దాంతో జనం కన్నెర్రజేశారు. రాజపక్స సోదరులు అధికారం నుంచి తప్పుకోవాలంటూ ఏప్రిల్‌ 9న దేశవ్యాప్తంగా వీధులకెక్కారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్‌ మస్క్‌ సంచలన ట్వీట్

మరిన్ని వార్తలు