Gotabaya Rajapaksa: గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో..

13 Jul, 2022 07:57 IST|Sakshi

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్‌ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు.

తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు. రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

24 గంటలు గొడవ
గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్‌ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు.
చదవండి: కళ్లుగప్పి పారిపోవాలనుకున్న శ్రీలంక మాజీ మంత్రి.. ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తుపట్టడంతో..

మరిన్ని వార్తలు