లంకలో కల్లోలం

5 Apr, 2022 06:12 IST|Sakshi
కొలంబోలో నిరసనకారుల నినాదాలు

కేబినెట్‌లోకి ప్రతిపక్షాలను ఆహ్వానించిన అధ్యక్షుడు

తిరస్కరించిన ప్రతిపక్షాలు

కేంద్ర ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్సే తొలగింపు

26 మంది మంత్రుల రాజీనామా

కొనసాగుతున్న ఆందోళనలు

కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్‌లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్‌ ప్రేమదాస, మనో గణేసన్‌ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు.

గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్‌ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్‌ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్‌ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్‌ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్‌ చర్యలపై లంక అధికార పక్షం ఎస్‌ఎల్‌పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్‌లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు.  

కేంద్ర బ్యాంకు గవర్నర్‌ రాజీనామా
లంక కేంద్ర బ్యాంకు గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కబ్రాల్‌ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్‌ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్‌ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్‌ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్‌ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్‌ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది.

లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం
ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు.

మరిన్ని వార్తలు