నెగ్గిన ప్రజాందోళన.. ఎట్టకేలకు శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజీనామా

14 Jul, 2022 19:47 IST|Sakshi

సింగపూర్‌: ప్రజాందోళనలకు తలొగ్గిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా దేశం విడిచిపారిపోయిన ఆయన.. మాల్దీవులు అక్కడి నుంచి గట్టి భద్రత మధ్య ఇవాళ సింగపూర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ప్రైవేట్‌జెట్‌లో సింగపూర్‌ చేరుకున్న వెంటనే.. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. జులై 13నే రాజీనామా చేస్తానని ప్రకటించిన రాజపక్స.. చెప్పాపెట్టకుండా మాల్దీవులకు పారిపోయాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

ప్రధాని నివాసం, ఆపై స్పీకర్‌ నివాసాలపై దాడులకు దిగారు నిరసనకారులు. ఈ క్రమంలో లంకలో అత్యవసర పరిస్థితి, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు, మిలిటరీ పహారా నడుమ శాంతి భద్రతలను రక్షిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. ప్రజల నిరసనలు తారాస్థాయికి చేరిన క్రమంలో రాజీనామా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు