Srilanka President Viral Video: 'గోట గో హోమ్‌' అంటూ పార్లమెంట్‌లో నినాదాలు...

5 Jul, 2022 15:30 IST|Sakshi

"Gota Go Home" Chants: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒకవైపు లంకలో రోజురోజుకి దిగజారిపోతున్న ఆర్థిక స్థితి. మరోవైపు రాజపక్సల పై ప్రజల్లో నెలకున్న ఆగ్రహం ఎంతమాత్రం చల్లారటం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే విపక్షాల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స.

ఈ మేరకు మంగళవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్‌ సమావేశాలను హజరైన గోటబయను చూసి పార్లమెంట్‌ సభ్యులు ' గోట గో హోమ్‌' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో ఆయన చేసేదేమిలేక అక్కడ నుంచి నిష్క్రమించారు. విదేశీ కరెన్సీ నిల్వలు లేకపోవడంతో అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. నెలలుతరబడి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని, ఇంధన సంక్షోభాన్ని, విద్యుత్‌ కోతలను ఎదుర్కొంది.

ఈ సంక్షోభం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఈ రోజు జరిగిన పార్లమెంట్‌ సమావేశంలో చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధితో శ్రీలంక కొనసాగిస్తున్న చర్చలు ఆగస్టు నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఖరారు చేయడంపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రస్తుతం తాము దివాలా తీసిన దేశంగానే చర్చలో పాల్గొంటున్నామని చెప్పారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పార్లమెంట్‌ నుంచి బలవంతంగా నిష్క్రమించిన వీడియోని పార్లమెంటు సభ్యుడు హర్ష డి సిల్వా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

(చదవండి: శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత)

మరిన్ని వార్తలు