Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం!

22 Jul, 2022 07:44 IST|Sakshi

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ అధ్యక్షుడిగా రణీల్‌ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నిరసనకారులపై భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న కొలంబోలోనే ప్రధాన క్యాంప్‌పై గురువారం అర్ధరాత్రి వందల మంది ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు దాడులు చేపట్టారు. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులకు చెందిన పలు టెంట్లను తొలగించారు. 

అధ్యక్షుడి సెక్రెటేరియట్‌ భవనం ముందు నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించే పనులు చేపట్టాయి భద్రతా బలగాలు. అయితే.. తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు నిరసనకారులు. ఏప్రిల్‌ 9 నుంచి అధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన వారు.. కొత్త అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. ‘ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మాకు విజయం సాధ్యమవుతుంది.’ అని నిరసన బృందాల ప్రతినిధి లాహిరు వీరసేకర పేర్కొన్నారు.

సముద్రతీర కార్యాలయాన్ని సైనికులు చుట్టుముట్టారు. ఏప్రిల్‌ నుంచి వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు అవసరమైన సామగ్రిని అందించడానికి ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. అధ్యక్ష భవనం సమీపంలో తమకు నిరసనలు చేపట్టేందుకు చోటు చూపించాలని డిమాండ్‌ చేశారు. ‘రణీల్‌ విక్రమసింఘే మమల్ని చెదరగొట్టాలనుకుంటున్నారు. వారు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. కానీ మేము వదిలిపెట్టం. నీచ రాజకీయాల నుంచి దేశాన్ని విడిపించటమే మా లక్ష్యం.’ అని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: డ్రాగన్‌ చైనా వల్లే లంకేయులకు ఈ గతి.. ప్రపంచ దేశాలకు ఇదే హెచ్చరిక!

మరిన్ని వార్తలు