Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే!

20 Jul, 2022 18:27 IST|Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి.

కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి  'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్‌ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం.

ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొంది.

ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అషిల దండేనియా తెలిపారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నిత్యావసరాల కోసం..
నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆహారం, ఔషధాల కోసం కొంతమంది మహిళలు దుకాణ యజమానులతో శృంగారంలో పాల్గొంటున్నారనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కొలంబో పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి చోట్ల పోలీసుల సహకారంతో వ్యభిచారం జరుగుతున్నట్లు నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యభిచారం సాఫీగా చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మహిళలను పోలీసులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నట్లు వెల్లడించాయి.
చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

మరిన్ని వార్తలు