దిగనంటే దిగను.. గొటబయా బెట్టుతో లంకలో ముదురుతున్న సంక్షోభం

7 May, 2022 07:58 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదువారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది.

అధ్యక్షుడు గొటబయా Gotabaya Rajapaksa తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం.  మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్‌ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.  

ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు.

చదవండి: అప్పుల కుప్ప .. అంతా రాజపక్సల మాయ!

మరిన్ని వార్తలు