అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన

17 Jul, 2022 15:21 IST|Sakshi

వాషింగ్టన్‌: శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఆ తర్వాత సింగపూర్‌ వెళ్లిపోయారు. ప్రస్తుతం గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్‌ రాజపక్సకు సైతం నిరసనల సెగ తగిలింది. అమెరికా, లాస్‌ఎంజల్స్‌లోని ఆయన ఇంటి ముందు పలువురు లంకేయులు నిరసనలు చేపట్టారు. తన తండ్రి తిరిగి స్వదేశాని వెళ్లాలని చెప్పాలంటూ నినాదాలు చేశారు. 

గొటబయ రాజపక్స జులై 13న రాజీనామా చేసేందుకు ముందు ఆందోళనలు చేపట్టినట్లు అమెరికా మీడియా తెలిపింది. 'మేము లాస్‌ఎంజల్స్‌లో గొటబయ రాజపక్స కుమారుడు మనోజ్‌ రాజపక్స ఇంటి ముందు ఉన్నాము. ఆయన శ్రీలంక ప్రజల సొమ్మును దోచుకున్నారు. దాంతో విలాసవంతమైన ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. ఇది మా డబ్బు. ఇది మా ఆస్తి.' అని పేర్కొన్నారు నిరసనకారులు.

మరోవైపు.. మనోజ్‌ రాజపక్స ఇంటి ముందు ఆందోళనలు చేయటాన్ని పలువురు శ్రీలంక నెటిజన్లు తప్పుపట్టారు. ఆయన రాజకీయాల్లో లేరని, అమెరికాలో ఉంటున్నారని గుర్తు చేశారు. ఆయన తండ్రి గొటబయ రాజకీయాలతో మనోజ్‌కు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. అయితే.. అమెరికా వచ్చినప్పుడు మనోజ్‌కు నిలువ నీడలేదని, ఇప్పుడు పలు ఇళ్లు కొనుగోలు చేశారని తిప్పికొట్టారు ఆందోళనకారులు.

ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: అందుకోసం శతవిధాల ప్రయత్నం చేశా: గొటబయ

మరిన్ని వార్తలు